
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 25: గతంలో ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియ ప్రహసంగా ఉండేది. రిజిస్ట్రేషన్ కార్యాయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం మున్సిపాలిటీ, పంచాయతీ కార్యాలయాల్లో మ్యుటేషన్ (పేరు మార్పిడి) కోసం తిరిగే వారు. కానీ ఇప్పుడు అలా కాకుండా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే సేవలను ప్రభుత్వం ఈనెల 6వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆస్తుల రిజిస్ట్రేషన్ తదుపరి మ్యుటేషన్ సైతం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే చేసే విధంగా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో పంచాయతీ, రాష్ట్ర మున్సిపల్ శాఖతో కలిసి సంయుక్తంగా సంబంధిత వివరాలను అనుసంధానం చేశారు. దీంతో కొనుగోలుదారుడి వివరాలను అందులో నమోదు చేయడం ద్వారా అప్పటికప్పుడు ఆస్తిమార్పిడి ప్రక్రియ పూర్తవుతుంది. సంబంధింత రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఆస్తిమార్పిడి పత్రాన్ని సైతం కొనుగోలుదారుడికి అధికారులు అందజేస్తున్నారు. కొనుగోలుదారుడు రూ.10 లక్షల లోపు ఆస్తికి రూ.వెయ్యి, అంతకంటే ఎక్కువ విలువ ఉన్నవాటికి దానిలో 0.1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. నూతన విధానంతో కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పింది. అవినీతికి తావు లేకుండా తీసుకువచ్చిన సేవలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇప్పటివరకు ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగగా సదరు కొనుగోలుదారులకు మ్యుటేషన్ పత్రాలను సైతం అందజేశారు.
ఆస్తి రిజిస్ట్రేషన్లో భాగంగా అప్పటికప్పుడే మ్యుటేషన్ చేస్తున్నాం. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు మార్పిడి, మ్యుటేషన్ పత్రాన్ని అందజేస్తున్నాం. ఈనెల ఆరు నుంచి సుమారు 50 వరకు ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే పత్రాలతో మ్యుటేషన్ చేయడం లాంటి పారదర్శకమైవ సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం హర్షనీయం. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలతో పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి.