ఇందూరు, జనవరి 16: చేతి మణికట్టు వద్ద గాయంతో బాధపడుతున్న అంతర్జాతీ య ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యను పలువురు పరామర్శించారు. భా రతదేశ ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన సౌమ్య కేరళ క్యాం పులో ఉండగా చేతి మణికట్టు వద్ద గాయమైంది. దీంతో వైద్యులు రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో అర్ధాంతరంగా ఆమె నిజామాబాద్‌కు చేరుకున్నారు. దీంతో ఆదివారం ఆమెను శాట్స్ (తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ) చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ, షకీల్, సాయిలు తదితరులు పరామర్శించారు. ఏడు సంవత్సరాల నుంచి వివిధ విభాగాల్లో దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సౌమ్యకు ప్రభుత్వం తరపున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ పేర్కొన్నారు.
వీసీ ద్వారా మంత్రి పరామర్శ
రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సౌమ్యను పరామర్శించారు. క్రీడాకారులకు గాయాలు సాధారణమని అన్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అవసరమనుకుంటే హైదరాబాద్‌లో ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం చేయిస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మాట్లాడుతూ.. సౌమ్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నివాస స్థలం కూడా ఇప్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షుడు నరాల సుధాకర్, ఫుట్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు షకీల్, అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సాయిలు, జావిద్, జీవన్‌రావు, సౌమ్య తల్లిదండ్రులు లక్ష్మి, గోపి తదితరులు పాల్గొన్నారు.