కృష్ణాతీరంలోని నిలువురాళ్ల ప్రాంతం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా మారనున్నది. కృష్ణ మండలం ముడుమాల్ సమీపంలో బృహత్ శిలాయుగం నాటి అపూర్వ కళాఖండం. సూర్యుడి గమనాన్ని బట్టి ఈ రాళ్ల నీడల ఆధారంగా వాతావరణ మార్పులను గుర్తించేవారని చెబుతున్నారు. ఇక్కడ క్రీ.పూ.500 ఏండ్ల కిందటి స్కైమ్యాప్ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. అంతటి ప్రాచూర్యంపొందిన ప్రాంతానికిపర్యాటకంగాగుర్తింపుతీసుకొచ్చేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ప్రయత్నాలు ప్రారంభించింది. ఆసంస్థ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తలా ఆధ్వర్యంలోని బృందం యునెస్కో గుర్తింపునకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్యారిస్‌లో ఉన్న టీటా ఫ్రాన్స్ చాప్టర్ అధ్యక్షుడు కౌండిన్య నందుతో చర్చించి దరఖాస్తు చేసే పనిలో నిమగ్నమైంది. ప్రపంచ వారసత్వ గుర్తింపు లభిస్తే చారిత్రక సంపద ఇక చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నది. దీంతో తెలంగాణ గొప్పతనం ప్రపంచ నలుమూలలకు విస్తరించనున్నది.
మహబూబ్‌నగర్, ఆగస్టు 12 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : తెలంగాణలోని చారిత్రక ప్రాంతమైన నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల గ్రామ సీపంలో ఉన్న ని లువురాళ్లను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఎంతో చరిత్ర ఉన్న నిలువురాళ్లకు సైతం యునెస్కో గుర్తింపు తీసుకువస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ సంస్థ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తలా ఆధ్వర్యంలోని బృందం ఆ దిశగా కృషి చేస్తున్నది.
ఆసియా ఖండంలో ఉన్న ఏళ్ల కిందటి నాటి చారిత్రక అస్ట్రోనామికల్ అబ్జర్వేటరీగా నిలువురాళ్లకు గుర్తింపు ఉన్నది. ఆదిమానవుడి కా లంలో ప్రతిష్టించిన నిలువురాళ్లకు తగినంత గుర్తింపు దక్కకపోవడం, పర్యాటక ప్రాంతంగా ఆదరణ లభించలేదు. ఇప్పటికే ఇక్కడ పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ కేపీ రావు, స్థానికులు, నిలువురాళ్లకు భూమి అందించిన రైతుతో టీ టా బృందం చర్చించింది.
ఆదిమానవులు నివసించిన సమయంలో నిలువురాళ్లను పాతారని చరిత్రకారుల అభిప్రాయం. పురావస్తు శాఖ సైతం ఇక్కడ అధ్యయనం చేసి ఆనాటి కాలమాన పరిస్థితులు, వా తావరణ మార్పులను తెలియజేసేందుకు ఈ ప్రాంతం కేంద్రంగా (ఆస్ట్రోనాటికల్ అబ్జర్వేట రీ) ఉండేదని పేర్కొంది. పంట పొలాల్లో 80 ఎకరాల విస్తీర్ణంలో 80 గండ శిలలు ఉన్నా యి. ఒక్కోటి 12 నుంచి 14 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న చిన్న రాళ్లు 3,500లకు పైగానే ఉన్నాయి. ఇప్పుడు వాతావరణ మార్పులను తెలుసుకునేందుకు అత్యం త ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉండ గా.. ఐదు వేల ఏండ్ల కిందట ఈ నిలువురాళ్ల నీడ ఆధారంగానే అప్పటి ప్రజలు రుతువులు, కాలాలను గుర్తించే వారని పరిశోధకులు అంచనా వేశారు. సూర్యుడి గమనాన్ని బట్టి పడే ఈ రాళ్ల నీడల ఆధారంగా వాతావరణ మార్పులను అప్పటివారు గుర్తించేవారని చెబుతున్నారు. క్రీ.పూ. 500 ఏండ్ల కిందటే ఇక్కడి వాళ్లు స్కె మ్యాప్ తయారు చేసుకున్నారని చరిత్రకారుల భావన. అప్పటి స్కై మ్యాప్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. అప్పటి స్కై మ్యాప్, ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు రూ పొందించిన ఆధునిక స్కై మ్యాప్‌నకు పోలికలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు తోడ్పడే సప్తర్షి మం డలాన్ని ఒక రాతిపై ఆనాడే చెక్కారు. నిలువు రాళ్లకు కేంద్ర బిందువుగా దాన్ని ఏర్పాటు చేశారు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది. రాళ్ల నీడలు ఒక క్రమంలో, ఒక నిర్దిష్ట ప్రాంతంలో పడగానే రుతుపవనాలు ప్రారంభమవుతాయని, నీడలు మరో క్రమంలో, మరో చోటికి మారితే ఎండాకాలం వచ్చిందని తెలుసుకుంటారని నిపుణుల బృందం గుర్తించింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ముడుమాల్ను పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు టీటా ప్రయత్నాలు ప్రారంభించింది.
నిలువురాళ్లపై పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ కేపీ రావుతో సమావేశం జరిపి ఈ ప్రాంతం విశిష్టత గురించి సమగ్ర వివరాలు సేకరించారు. దీంతో పాటుగా స్థానికులతో చర్చించారు. నిలువురాళ్ల భద్రంగా కాపాడినరైతు అంజప్ప ఆయన కుటుంబ సభ్యుల కృషిని ప్రశంసించి ఈ మేరకు వారిని సన్మానించారు. భూమి ఇచ్చిన రైతు తనకు నష్టపరిహారం తక్కువ వచ్చిందని పేర్కొనగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు హామీ ఇచ్చారు. యునెస్కో గుర్తింపు కోసం పారిస్‌లో ఉన్న టీటా ఫ్రాన్స్ చాప్టర్ అధ్యక్షుడు కౌండిన్య నందుతో చర్చించి పారిస్‌లోని యునెస్కో కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిలువు రాళ్లు బృహత్ శిలాయుగానికి చెందినవి. క్రీ.పూ.1000 ఏండ్ల కిందట వీటిని ఏర్పాటు చేశారు. కొన్ని రాళ్ల కిందట సమాధులుండేవి. మరికొన్ని మాత్రం కాలాలు, రుతువులు తెలుసుకునేందుకు పాతారు. వీటన్నింటినీ సూర్యుడి గతి ప్రకారం పాతారు. ఈ రాళ్లకు సీజన్లో సూర్యుడు అభిముఖంగా వస్తాడు. వరుసలుగా పేర్చినవి ఐదువేలు ఉన్నాయి. పెద్ద రాళ్లు 80 ఉన్నాయి. వీటిలో వర్షాలకు 20 పడిపోయాయి. ఒక్కోటి సుమారు 14 అడుగుల వరకు ఉన్నాయి. ఇలాంటివి మన దేశంలో ఎక్కడా లేవు. బ్రిటన్‌లో స్టోన్ హెంజ్ అని ఉన్నాయి. వాటి తర్వాత మన శిలలే ప్రసిద్ధి. ఈ నిలువు రాళ్లను ఉత్తరాయనం, దక్షిణాయనం చూసేందుకు పూర్వీకులు ఉపయోగించారు. దిక్కులను చూసేందుకు కూడా ఈ రాళ్లు ఉపయోగపడ్డాయి. 2004 నుంచి వీటిపై అధ్యయనం చేస్తున్నాం. పలు జర్నల్స్ రాయడమే కాకుండా ఉపన్యాసాలు సైతం ఇచ్చాను. వీటిని తెలుసుకొని విదేశాల వాళ్లు వచ్చి అధ్యయనం చేస్తున్నారు. మన పూర్వీకులకు ఖగోళ శాస్త్రం మీద విపరీతమైన అవగాహన ఉందని చెప్పేందుకు నిలువురాళ్లే ఉదాహరణ. దక్షిణాసియాలో అతి పురాతనమైన నక్షత్ర మండలం చిత్రించింది ఇక్కడే. కొరియా, జపాన్ వంటి దేశాల్లోనూ ఇలాంటివి ఉన్నాయి. వాటితో పోలిస్తే మనవే పెద్దవి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించదగ్గ ప్రాంతమిది. అక్కడి రైతులకు వేరే చోట భూములు చూపించి ప్రభుత్వం నిలువురాళ్లు ఉన్న స్థలం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలి.
ఒకప్పుడు సుమారు 70 ఎకరాల్లో నిలువురాళ్లు ఉండేవి. ఇప్పుడు 45 నుంచి 50 ఎకరాల్లో మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ఐదెకరాలు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేయించింది. అప్పటి మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్, పురావస్తు శాఖ అధికారి విశాలాక్షి, మాజీ ఏడీ కేపీ రావు నిలువురాళ్లను కాపాడేందుకు కృషి చేశారు. 45 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు ఐదెకరాల్లో నిలువురాళ్లు భద్రంగా ఉన్నాయి. వీటిని చూసేందుకు విదేశస్తులు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో జపాన్, ఇండోనేషియా, స్విట్జర్లాండ్, మలేషియా తదితర దేశాల నుంచి పర్యాటకులు, శాస్త్రవేత్తలు వస్తున్నారు. కానీ మన ప్రాంతం వాళ్లు మాత్రం ఎవరూ రారు. యునెస్కో గుర్తింపు వచ్చేలా చూసి పర్యాటకంగా సదుపాయాలు కల్పిస్తే మా ప్రాంతం కాస్త అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
మక్తల్ పట్టణానికి కేవలం 25 కి.మీ. దూరంలో ఉన్న ముడుమాల్ నిలువురాళ్లు ఎంతో అరుదైన సంపద. రామప్ప కోటకు యునెస్కో గుర్తింపు రావడంతో మా ప్రాంత వాసులు సైతం ఈ నిలువురాళ్లకు అలాంటి గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ఐదెకరాలను రూ.7లక్షల చొప్పున రైతులతో కొనుగోలు చేసి కాపాడే ప్రయత్నం చేశాం. ఇంతటి విలువైన సంపద ప్రపంచానికి తెలిసేలా చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. వీటిని చూసేందుకు మన వాళ్ల కంటే విదేశాల నుంచే ఎక్కువ మంది వస్తున్నారు. స్థానికుడైన పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారసత్వ సంపదను కాపాడేందుకు, గుర్తింపు వచ్చేందుకు ప్రయత్నిస్తాం.