రామగిరి, మార్చి 31 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్పీ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బాలిక పాఠశాల రూపురేఖలు మారనున్నాయి. మన బస్తీ.. మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలుగు, ఉర్దూ మీడియం కొనసాగుతుండగా 6నుంచి 10వ తరగతి వరకు 150మంది విద్యార్థినులు చదువుతున్నారు. ప్రభుత్వ పిలుపుతో పాఠశాల అభివృద్ధికి లయన్స్ క్లబ్ తరఫున యరమాద శ్రీనివాస్‌తోపాటు పూర్వ విద్యార్థులు ముందుకురావడం విశేషం.
ప్రస్తుతం తెలుగు, ఉర్దూ మీడియంలో బోధిస్తుండగా తెలుగు మీడియంలో 119, ఉర్దూ మీడియంలో 31మంది విద్యార్థినులు ఉన్నారు. ఎఫ్ఏసీ ప్రధానోపాధ్యాయురాలితోపాటు 12మంది రెగ్యులర్, మరో ముగ్గురు ఉపాధ్యాయినులు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో భాగంగా గతేడాది తొమ్మిదో తరగతి విద్యార్థిని బషీరా రూపొందించిన వీల్ చైర్ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికై ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు అందుకున్నది. క్రీడా పోటీల్లోనూ విద్యార్థినులు రాణించేలా తర్ఫీదునిస్తున్నారు. పాఠశాల గోడలపై పలు సబ్జెక్టులకు సంబంధించిన చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జీవ, భౌతిక రసాయన శాస్ర్తాలకు సంబంధించిన చిత్రాలు విద్యార్థినులకు విజ్ఞానాన్ని పంచుతున్నాయి.
విద్యార్థినుల సంఖ్యకు తగ్గట్టుగా మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించాల్సి ఉంది. అదనపు తరగతి గదులు, ఫర్నిచర్, డిజిటల్ తరగతి గదులు, పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించే వీలుంది.
విద్యార్థినులందరూ నిరుపేదలే. ఎక్కువ మంది సంక్షేమహాస్టళ్లలో ఉంటూ ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సార్ రూపకల్పన చేసిన మన బస్తీ – మన బడి కార్యక్రమానికి మా పాఠశాల ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఉన్నతాధికారుల సూచనలతో ఇప్పటికే దాతలు, పూర్వ విద్యార్థులతో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాం. ఉపాధ్యాయినులు విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా బోధిస్తున్నారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రోత్సహిస్తున్నాం.
– మారోజు పుష్పలత, ప్రధానోపాధ్యాయురాలు, ఎఫ్ఏసీ
మాది పీఏపల్లి మండలం పెద్దగట్టు. నేను ప్రభుత్వ సంక్షేమ హస్టల్లో ఉండి చదువుతున్నాను. మన బస్తీ.. మన బడి కార్యక్రమానికి మా పాఠశాల ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి మా పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్సార్కు కృతజ్ఞతలు.
– ఆర్.అఖిల, 6వ తరగతి విద్యార్థిని