యాసంగిలో పండిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు సన్నద్ధ మవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 824 కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో తలమునకలయ్యారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. కర్షకులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా అడ్డుకోవాలని అధికారులకు రైతులు సూచించారు.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రైతులపై తీవ్ర నిర్లక్ష్యం చూపించిన కేంద్రం తీరును ఎండగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్నదాతలకు తానే అండగా ఉండేందుకు సిద్ధమై యాసంగి ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం అధికారులు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 824 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల పరిధిలో ధాన్యం కొనుగోలుపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆయా జిల్లాల అధికారులతో మహబూబ్‌నగర్ జెడ్పీలో సమావేశమయ్యారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ధాన్యం కొనుగోలుకు ప్రధాన అడ్డంకిగా మారిన గన్నీ బ్యాగుల కొరత లేకుండా ఈ ఏడాది అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు తర్వాత తరలింపు ప్రక్రియకు వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. గతేడాది కొందరు మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా ధాన్యం అన్లోడ్ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు అధికారుల దృష్టికి రాగా.. ఈ ఏడాది ఆ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. 08542-241165 నెంబరుకు ఆఫీసు వేళల్లో ఫోన్ చేసి సమస్యను అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి, తాలు, చెత్త లేకుండా తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ ఉండేలా టెంట్లు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రైతులను ఇబ్బందులు పెట్టే మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కలెక్టర్లు సిద్ధమయ్యారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. మధ్యన ఉండే వ్యక్తులతో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కలెక్టర్లు పౌర సరఫరాలు, మార్కెటింగ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సూచించారు. ధాన్యం కొనుగోలుకు వడివడిగా ఏర్పాట్లు చేయడంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సర్కార్ ఇక్కడి ధాన్యం కొనుగోలు చేసేందుకు వేలాది కోట్ల భారం భరిస్తున్నది. అయితే, సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక, ఏపీ రాష్ర్టాల నుంచి కొందరు రైతులు, దళారులు అక్కడి ధాన్యాన్ని తెలంగాణలో విక్రయించేందుకు ప్రయత్నిస్తారని, వారిపై అప్రమత్తంగా ఉండాలని రైతులు కోరుతున్నారు. స్థానికంగా కొందరు అధికారుల ప్రమేయంతోనే గతేడాది కర్ణాటక ధాన్యాన్ని నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో విక్రయించినట్లు పలువురు తెలిపారు. మహహబూబ్నగర్లో జరిగిన ధాన్యం కొనుగోళ్ల సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సైతం కర్ణాటక ధాన్యం తరలించే ప్రమాదం ఉందని, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. పక్క రాష్ట్రం వడ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరించినా.. రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ ముందుకొచ్చి యాసంగి వడ్లు కొంటున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జెడ్పీ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, రైతుబంధు సమితి డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి తదితరులున్నారు.
వనపర్తి రూరల్, ఏప్రిల్ 13 : యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటన చే యడంతో హిమాలయ పర్వతాల్లో వనపర్తి టీఆర్ఎస్ నాయకులు ప్రదర్శన చేపట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులు ఫ్లకార్డులు చేతబూని సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వరి కొనుగోలుకు రాష్ట్ర ప్ర భుత్వం ముందుకు రావడంపై రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మం త్రి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి కౌన్సిలర్లు మహేశ్, లక్ష్మీనారాయణ, రవి, కృష్ణయ్య, టీఆర్ఎస్ సోషల్ మీ డియా వనపర్తి అధ్యక్షుడు మాధవ్‌రావు సునీల్, నాయకులు తిరుమల, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, సుబ్బు, రాము, నరేశ్ పాల్గొన్నారు.