
పేదల విద్యాభివృద్ధికి కృషి చేసిన మేధావి
ఆయన స్ఫూర్తితోనే పాలమూరులో రెడ్డి సేవా సమితి
అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఆగస్టు22: రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహోన్నత వ్యక్తి అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం బహదూర్ 153వ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో ఉన్న ఆయన విగ్రహానికి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాం కాలంలో కొత్వాల్ (పోలీస్ కమిషనర్)గా పనిచేసిన రాజా బహదూర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాయినిపేటలో జన్మించారని తెలిపారు. పేదలు చదువుకోవాలనే లక్ష్యంతో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తూ రెడ్డి హాస్టల్లో ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ స్ఫూర్తితో పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో హాస్టల్ ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడ ఉండి చదువుకున్న ఎందరో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, మేధావులుగా ఎదిగారన్నారు. సమాంతర అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కులాలు, మతాల వారు సమానంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.
ఆశయసాధనకు కృషి చేయాలి
రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి ఎంతో చరిత్ర ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి ఉమ్మడి పాలమూరు జిల్లాలో జన్మించడం మన అందరి అదృష్టమని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజాం ప్రభుత్వంలో ఉండి చదువుకునేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పించారని తెలిపారు. ఆయన ఆశయసాధన కోసం అందరం కృషి చేస్తూ అందరికీ విద్యను అందుబాటులో ఉంచేందుకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుదామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, రెడ్డి సేవా సమితి నాయకులు చిన్నారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ధనుంజయరెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు విఠల్‌రెడ్డి, కట్టా రవికిషన్‌రెడ్డి, అనంతరెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.
రూ.38 లక్షలతో వినాయక భవన నిర్మాణం
మహబూబ్‌నగర్ ఆగస్టు 22: కనీవినీ ఎరుగని రీతిలో మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేసుకుందామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి సమీపంలో వినాయక భవన నిర్మాణానికి సంబంధించి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిపాదిత వినాయక భవన్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. వినాయక భవన్ నిర్మాణానికి రూ.38 లక్షలు మంజూరు చేశామని, మొదటి విడుతగా పనులు ప్రారంభించేందుకుగానూ రూ.15లక్షలు ఇప్పటికే విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. త్వరలో వినాయక చవితి వస్తున్నందున ఇంజినీరింగ్ అధికారులు, వినాయక భవన నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. అనంతరం క్లాక్‌టవర్ వద్ద వినాయక మండపాన్ని పరిశీలించి, పూల వ్యాపారులతో మంత్రి మాట్లాడారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఆయన సోదరి శ్రీదేవి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డిప్యూటీ ఇంజినీర్ రాములు, అసిస్టెంట్ ఇంజినీర్ వెంకట్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, కౌన్సిలర్లు అనంతరెడ్డి, రాంలక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
పద్మశాలి కులస్తుల సంక్షేమానికి కృషి..
సమాజానికి వస్ర్తాలను అందిస్తున్న పద్మశాలి కులస్తుల సంక్షేమానికి, అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. నూలు పూర్ణిమ సందర్భంగా పద్మావతికాలనీ కమాన్ నుంచి మార్కండేయ దేవాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి 2021 వరకు జరిగిన విద్యాసంవత్సరాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. పదిలో పది గ్రేడ్లు, ప్రభుత్వ మెడిసిన్ సీట్ సాధించిన, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5116 నగదు పారితోషికం అందించడం, మచ్చ మాణిక్యరావు స్మారక ప్రతిభా పురస్కారాలను అందించడం గొప్ప విషయమన్నారు. అనంతరం కవి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రచించిన పద్మశాలి వంశ చరిత్రను తెలిపే పద్మశాలి మొగ్గలు కవితాసంపుటిని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ వాణిప్రభాకర్రావు, జిల్లా పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పానుగంటి బాలరాజు, నాయకులు బాస రామస్వామి, శంకర్, నాగస్వామి, ప్రతాప్, సత్యనారాయణ, పల్లాంటి తారకం, టీవోపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి బుదారపు వీరేంద్రబాబు, సంయుక్త కార్యదర్శి పల్లాటి శ్రీకాంత్, వెంకటేశ్, కడదాసు సత్యనారాయణ, తాటి రాజేశ్, నీలి కిశోర్ ఉన్నారు.