
ప్రజలు సహకరించాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
క్రీడలు, పర్యాటకానికి ప్రాధాన్యత
కూడళ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 21: రాష్ట్రంలో క్రీడలు, పర్యాటకానికి ప్రాధాన్యత ఇస్తున్నామనిఎక్సైజ్ శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో జరుగుతున్న పనులను, షాషాబ్‌గుట్టలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మిస్తున్నామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో స్టేడియంతోపాటు అకాడమీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని చెప్పారు. స్టేడియం పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పనులు నత్తనడకన చేయొద్దన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో చేపట్టిన కూడళ్ల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. షాషాబ్‌గుట్ట సీసీ రహదారితోపాటు పట్టణంలోని ఇతర రోడ్లను ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. ప్రధాన రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్, పీఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరేందర్, డీఎంహెచ్‌వో కృష్ణ, కౌన్సిలర్లు ఆనంద్‌గౌడ్, షబ్బీర్‌అహ్మద్, రామ్, నాయకులు అంజద్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.