
మహబూబ్‌నగర్, సెఫ్టెంబర్ 20: జిల్లా వ్యాప్తంగా 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధింత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇంటింటి సర్వే చేసి స్టిక్కర్‌ను అంటించాలని, స్టిక్కర్లో పేర్కొన్న అంశాలు రిజస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. వినాయక నిమజ్జనం విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా, మండల అధికారులను కలెక్టర్ అభినందించారు. వచ్చే మంగళవారం హరితహారం, వైకుంఠధామాలపై ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఉపాధి హామీ సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారులు హాజరుకావాలని సూచించారు. ఐసీడీఎస్ కార్యాక్రమాలపై ప్రత్యేకంగా ఒకరోజు సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మయూరి ఏకో పార్క్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలలు ప్రారంభించినందున విద్యార్థుల ఆరోగ్య సంసరక్షణపై దృష్టి కేంద్రీకరించాలని, సాంఘిక సంక్షేమ వసతిగృహాలను ప్రత్యేక అధికారులు సందర్శించాలని, ప్రతి పాఠశాల మరుగుదొడ్డి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతివిద్యార్థిని సరిగ్గా పర్యవేక్షించాలన్నారు. మెడికల్ కళాశాల, పీయూలో ప్రత్యేక సెమినార్లు నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, హెచ్ఆర్సీ కమిషన్ నుంచి వచ్చే ఫిటిషన్లపై వెంటనే స్పందించాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్మిస్తున్న హాస్టళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంపై రెవెన్యూ సంబంధింత శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శులు సకాలంలో విధులకు హాజరుకావాలని, అధికారులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నండ్లాల్ పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత, జెడ్పీ సీఈవో జ్యోతి పాల్గొన్నారు.
ప్రజావాణిలో ధరణి సెల్: కలెక్టర్
ధరణి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్లో ధరణి సెల్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ధరణికి సంబంధించి భూసమస్యలపై వచ్చిన ఫిర్యాదుల సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ధరణి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ఆధ్వర్యంలో ఒక కీయాస్క్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మండలం నుంచి సీనియర్ అసిస్టెంట్, సర్వేయర్‌ను ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు పంపించాలని సూచించారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ధరణి సెల్ నడుస్తుందని తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న ధరణి గదితోపాటు ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్, డీఆర్వో, భూమి కొలతల శాఖ సహాయ సంచాలకులు ఉంటారని వెల్లడించారు. మండలం నుంచి సీనియర్ అసిస్టెంట్, సర్వేయర్ హాజరుకావాలని, వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించడంలో భాగంగా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజావాణికి 73 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఆయా శాఖల అధికారులు ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని సూచించారు.