
అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్‌నగర్, ఆగస్టు 18 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టనున్న ఉదండాపూర్ పునరావాస కేంద్రం పనులకు 10రోజుల్లో టెం డర్లు పిలువాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పునరావాస కేంద్రంలో వైకుంఠధామం, చెత్తను వేరు చేసే షెడ్లు, ఆలయ నిర్మాణం, రహదారులు, మురుగుకాల్వల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల భవన నిర్మాణం, మిషన్ భగీరథ తాగునీరు తదితర అంశాలపై శాఖలవారీగా సమీక్షించారు. భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి సం తోషం కలిగించేవిధంగా త్వరితగతిన ఆర్అండ్ఆర్ పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదన పు కలెక్టర్ సీతారామారావు, పాలమూరు ఎత్తిపోతల పథకం సీఈ రమేశ్, ఎస్ఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, డీఎస్పీ శ్రీధర్, ఆర్డీ వో పద్మశ్రీ, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్, ఉద్యాన డీడీ సాయిబాబా ఉన్నారు.
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
డెంగీ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించిన వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రిజ్వికి పలు అంశాలను వివరించారు. జిల్లావ్యాప్తంగా దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే మురుగునీటి గుంతల్లో 5లక్షల గంబూషియా చేపపిల్లలను వదిలినట్లు పేర్కొన్నా రు. డెంగీ,, మలేరియా ఇతర సీజనల్ వ్యా ధులపై వైద్యాధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు శనివారం సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2019లో 886 డెంగీకేసులు నమోదు కాగా, 2020లో 113కేసులు, ఈ ఏడాది ఇప్పటివరకు 30 డెంగీ కేసులు నమోదయ్యాయని వివరించారు. వీసీలో డీఎంహెచ్‌వో కృష్ణ, డీపీవో వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా నివారణాధికారి విజయకుమార్ ఉన్నారు.
బాలస్వస్త్య కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలి
రాష్ట్రీయ బాలస్వస్త్య కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. కొవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడిన నేపథ్యంలో విద్యార్థులకు గ్రామాల్లోనే వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 18ఏండ్లలోపు వారికి వైద్య పరీక్షలు చేయాలని సూ చించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో కృ ష్ణ, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ సృజన, జిల్లా మలేరియా నివారణాధికారి విజయ్‌కుమా ర్, డీపీవో వెంకటేశ్వర్లు ఉన్నారు.
తాసిల్దార్ కార్యాలయం తనిఖీ
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 18 : అడ్డాకుల తాసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ వెంకట్రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధరణి రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తాసిల్దార్ కిషన్‌కు కలెక్టర్ సూచించారు. అలాగే భూరికార్డుల్లో పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అనంతరం గ్రామంలో హరితహారం మొక్కలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, ఏవో శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, ఎంపీవో విజయలక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.