
దేపల్లికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి నియామకం
మహబూబ్‌నగర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ హైకోర్టు జడ్జిగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం దేపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల వెంకటేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఆయన తొలుత షాద్‌నగర్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం సమైక్య రాష్ట్రంలో జిల్లా స్థాయిలో వివిధ కోర్టుల్లో న్యాయమూర్తిగా కొనసాగారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. బుధవారం సుప్రీంకోర్డు కొలిజియం ప్రకటించిన హైకోర్టు జడ్జిల జాబితాలో వెంకటేశ్వర్‌రెడ్డి పేరు ఉన్నది. దేపల్లి వాసి హైకోర్టు జడ్జిగా ఎంపికైనందుకు గ్రామస్తులంతా సంతోషంగా ఉన్నారని ఆయన బంధువు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పాలమూరు వాసికి హైకోర్టు జడ్జిగా అవకాశం రావడంపై ఉమ్మడి జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.