
నో మాస్క్, నో పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌రూట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్.. ఇలాంటి నిబంధనలు మాకు పట్టవు అనుకుంటున్నారా.. ట్రాఫిక్ పోలీస్ లేడు కదా అని మెల్లగా సైడై పోతున్నారా..అయితే మీ జేబుకు చిల్లు పడినట్లే..ఇంటికి వెళ్లే లోపే జరిమానా రూపంలో ఫోన్‌కు మెసేజ్ కాని, రెండ్రోజుల్లో ఇంటికి ఫైన్ కాపీ కాని వచ్చేస్తుంది..కాస్త చూసుకోండి. ట్రాఫిక్ పోలీసులు చాలా స్మార్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించారో ఒక్క ఫొటో తీసి..జాతకం మొత్తం చూసి..జరిమానా వేసేస్తారు. ఎనిమిది నెలల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో 1,42,334 కేసులు నమోదు చేసి రూ.8.47కోట్లకు పైగా జరిమానా విధించారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా..అందుకే ప్రతి ఒక్కరం నిబంధనలు పాటిద్దాం..సురక్షితంగా ఉందాం.
మహబూబ్‌నగర్ క్రైం, సెప్టెంబర్ 12: ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేసినా, ఎవరూ చూడటం లేదని సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, లైసెన్స్, హెల్మెట్, మాస్కు ధరించకుండా, అతివేగంగా వాహనాలు నడిపినా ట్రాఫిక్ పోలీసులు తమ సెల్ఫోన్లో ఒక ఫొటో తీస్తే చాలు ఆన్లైన్లో వేల రూపాయల జరిమానా విధించి ఇంటికే రశీదు పంపిస్తున్నారు. వెంటనే సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపిస్తున్నారు. 2020లో 1,59,011 కేసుల్లో రూ.9కోట్ల 57లక్షల 3,186 ఈ-చలానా రూపంలో జరిమానా విధించారు. 2021 ఆగస్టు 31వ తేదీవరకు 1,42,334 కేసుల్లో రూ.8కోట్ల 47లక్షల 74,059 జరిమానా విధించారు.
జనవరి నుంచి కఠిన వైఖరి
వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే చౌరస్తాలో ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్ వెబ్ కెమెరా ద్వారా ఫొటోతీసి అప్లోడ్ చేస్తారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా, మాస్కు ధరించకుండా, ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌రూట్ డైరెక్షన్లో వాహనాలు నడపడం, హెల్మెట్ లేకపోవడం, నోపార్కింగ్ డేంజరస్ పార్కింగ్, అతివేగం తదితర ఉల్లంఘనలపై కెమెరాలో ఫొటోలు తీసి సాక్షాలతో అప్లోడ్ చేస్తారు. తనిఖీల్లో పట్టుబడి నప్పుడు ఈ-చలానాలో ఆ వాహనంపై ఎన్ని జరిమానాలు ఉన్నాయో బయటపడుతాయి. అప్పుడు జరిమానాతో సహా మొత్తం చెల్లించిన తర్వాతనే వాహనాన్ని వదిలిపెడుతారు. మూడుసార్లు చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేస్తారు.
ఇంటికే ఈ-చలానా
ఇప్పటికే ఈ-చలానా విధానం అమలులో ఉన్నది. మరింత విస్తృతంగా అమలుచేయాలని నిర్ణయించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఓవర్‌లోడ్‌తో వాహనాలు నడిపినా జరిమానా విధిస్తారు. డ్రైవింగ్లైసెన్స్ లేకపోతే సెక్షన్-184 ప్రకారం ముందుగా రూ.500 జరిమానా ఎంటర్ చేసిన తర్వాతనే మిగతా ఉల్లంఘనలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. వాహనదారుడి వాహనం నెంబర్ ట్యాబ్‌లో అప్లోడ్ చేయగానే ఆతడి మొబైల్‌కు ఓటీపీ నెంబర్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆ వాహనంపై ఇదివరకున్న జరిమానాలన్నీ వస్తాయి. అవన్నీ చెల్లించిన తర్వాతనే వాహనాన్ని విడుదల చేస్తారు.
నిబంధనలు అతిక్రమిస్తే..
నోపార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేస్తే ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. బైక్‌లు, ఆటోల యజమానులు ఇకపై పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆటోలకు ఇదిపెద్ద సమస్య కానున్నది. వారికి తెలియకుండానే ఫొటోలు తీసి, మొబైల్‌కు సందేశం(మెసేజ్) వచ్చేవరకు చేసిన పొరపాటు ఏంటో తెలియని పరిస్థితి. పట్టణంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి వన్‌టౌన్ ప్రాంతం వరకు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పోలీసులు తమ ఫోన్లో నిబంధనలు అతిక్రమించే వారిపై జరిమానా వేస్తారు. ఇతర రాష్ర్టాల వాహనాల ఉల్లంఘనపై డబ్బులు నేరుగా వసూలు చేయనున్నారు.
పోలీసులపై తగ్గనున్న భారం
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల రోడ్లపై పలు సమస్యలు తలెత్తుతున్నాయని, పోలీస్, ట్రాఫిక్ విభాగం వారు ప్రత్యక్షంగా తనిఖీలు చేస్తూ జరిమానా విధిస్తున్నారు. కెమెరాల్లో వీడియో చిత్రీకరణ ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తూ నేరుగా వాహన యాజమాని ఇంటికి జరిమానా పత్రం వెళ్తుంది. తపాలా, మొబైల్ ఫోన్, పోలీస్ వెబ్సైట్ ద్వారా ఈ-చలానా జరిమానా వివరాలు అందజేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అమలులో ఉండి సత్ఫలితాలు ఇస్తున్న ఈ పద్ధతి వల్ల పోలీసు అధికారులపై భారం తగ్గుతుందని, సాక్ష్యాధారాలతో సహా ఉండటం వల్ల పోలీసు శాఖపై నిందలుమోపే అవకాశం ఉండదు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ. 1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.500, మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 2వేలు, ఆరునెలలు జైలు, లైసెన్స్ రద్దు చేస్తారు. బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తే రూ.వెయ్యి, నెంబర్ ప్లేట్ లేకుంటే రూ. 200, నెంబర్ లేకుంటే ఇతర అక్షరాలు రాస్తే రూ.500, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.200, మైనర్ డ్రైవింగ్ 1000, ర్యాష్ డ్రైవింగ్ వెళ్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తారు.