
కేంద్ర బడ్జెట్ ఉమ్మడి జిల్లాకు అసంతృప్తి మిగిల్చింది.మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాలమూరుపై శీతకన్ను చూపారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదు. రైల్వేపరంగా మరోసారి తీవ్ర అన్యాయం చేశారు. గద్వాల-మాచర్ల, జడ్చర్ల-శ్రీశైలం, కృష్ణా-వికారాబాద్కుమొండిచేయే.. విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యం దక్కలేదు. ఉద్యోగులను నిరాశ, నిస్పృహలకు లోను చేయగా.. సామాన్యులకు భరోసా కల్పించలేదు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అత్యంత దుర్మార్గం. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే అంశం కనిపించలేదు. అందుకే పసలేని పద్దుపై ప్రజలు భగ్గుమంటున్నారు.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ పాలమూరుకు నిరాశే మిగిల్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి శీత కన్ను చూపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎప్పటిలాగే జాతీయ హోదా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు చట్ట ప్రకారంగా నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఇస్తారని ఆశిస్తే మళ్లీ నిరాశే ఎదురైంది. నారాయణపేటకు సైనిక్ స్కూల్ కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పాలమూరుకు అన్యాయం జరిగింది. రైల్వే బడ్జెట్ ఎత్తేసి సాధారణ బడ్జెట్లో కలిపేసిన తర్వాత రైల్వేల పరంగా ఏం కేటాయిస్తున్నారో కూడా తెలుసుకునే పరిస్థితే లేకుండా చేశారు. దీని ప్రభావంతో కనీసం రైల్వేల కేటాయింపులపై చర్చించేందుకు కూడా ఎంపీలకు సమాచారం లేని పరిస్థితి తలెత్తుతున్నది. ప్రతిసారీ రైల్వే కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయమే జరుగుతుండగా.. ఈసారి కూడా పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు భగ్గుమంటున్నారు. విద్య, వైద్యం కేటాయింపులో కేంద్రం మరోసారి మొండిచేయి చూపిందని, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే కేటాయింపులేవీ లేవని స్థానికులంటున్నారు.
నదుల అనుసంధానంపై అనుమానాలు..
దేశంలో ఎప్పటి నుంచో ఉన్న నదుల అనుసంధానంపై ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. గోదావరి-కృష్ణా, కృష్ణా- పెన్నా, పెన్నా-కావేరి నదుల అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, గోదావరి-కృష్ణా అనుసంధానంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో ఉండే అధిక జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలిస్తారా..? లేక నాగార్జునసాగర్‌కు తరలిస్తారా..? అనే అంశంపై చర్చిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు తరలిస్తే శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడిన రైతులకు లాభదాయకంగా ఉంటుందని అలా కాకుండా సాగర్‌కే నేరుగా తరలిస్తే మాత్రం పాలమూరు ప్రాంతానికి అన్యాయం చేసినట్లేనని అంటున్నారు. అనుసంధానం కంటే ముందు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దుర్మర్గమని పేర్కొంటున్నారు.
రైల్వే పరంగా మరో‘సారీ’..
సాధారణ బడ్జెట్లో రైల్వేకు కేటాయింపులు చేస్తూ వస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏఏ ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం కార్యాలయానికి నోట్ ద్వా రా పంపిస్తారు. ఆ నోట్ మీడియాకు రిలీజ్ చేసిన తర్వాతే ఈ ప్రాంతానికి రైల్వే కేటాయింపులు తెలుస్తాయి. ఇంతకంటే అన్యాయం ఏమీ లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న రైల్వే బ డ్జెట్నే ఎత్తేసిన ఈ ఘనులు ఈ ప్రాంత రైల్వే ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ వ స్తున్నారు. ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు తప్పించి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకు కూడా రైల్వే కేటాయింపులు చేయడంలేదు.
అందుకే ఈసారి కూడా గద్వాల-మాచర్ల, జడ్చర్ల-శ్రీశైలం, కృష్ణా-వికారాబాద్‌కు తిరిగి మొండిచేయే చూపించే పరిస్థితి కనిపిస్తున్నదని రైల్వే రంగ నిపుణులు చెబుతున్నారు.
పక్కాగా అమలు చేయాలి..
వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే యాంత్రీకర ణ మంచిదే. దీంతో రైతుల కు మేలు జరుగుతుంది. కానీ పక్కాగా అమలు చేస్తే నే ఇది సాధ్యం. సేంద్రియ వ్యవసాయంపై ప్రస్తావించినా.. రైతులను ఆ దిశగా నడిపించే వ్యవస్థ వస్తే స్వాగతించొచ్చు. అయితే, మన ప్రాంతానికి మాత్రం అన్యాయమే చేసిందీ బడ్జెట్. విద్యారంగాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్రం ఆ దిశగా విఫలమైంది. జిల్లాకో నవోదయ విద్యాలయం కేటాయించాల్సి ఉండగా.. కొత్త జిల్లాలు ఏర్పడి ఆరేండ్లు అయినా నేటికీ ఒక్క నవోదయ కూడా రాలేదు. ఈ బడ్జెట్లో వేతన జీవులకు, పేదలకు నిరాశే మిగిలింది.
జాతీయ హోదా మరిచారు..
కరోనాతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి వర్గాలను ఆదుకోని బడ్జెట్ ఇది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడంలో వైఫల్యం కనిపిస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరల మాట కూడా ఎత్తలేదు. కార్పొరేట్ల లాభాలు పెరిగినా.. వారిపై పన్నులు మోపలేదంటే ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు తగినంత కేటాయింపులు జరపకపోవడం చూస్తే ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన, కార్పొరేట్ అనుకూలమైన బడ్జెట్ అని చెప్పొచ్చు. ఐదు రాష్ర్టాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ యూపీలోని సాగునీటి ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల భారీ నిధులు కేటాయించింది. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకపోవడం దారుణం.
తెలంగాణకు అన్యాయం..
బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కరో నా కారణంగా ఇబ్బందు ల్లో ఉన్న రాష్ట్రంపై కనిక రం చూపలేదు. రైల్వే ప్రా జెక్టు లేవు. బిందు సేద్య ప థకానికి ఎదురుచూస్తున్న రైతులకు నిధులు ఇవ్వకుం డా నిరాశ పరిచింది. రైతన్న, నేతన్నలను ఆదుకోలేదు. సామాన్యులను నిరాశ నిస్పృహలకు గురి చేస్తూ మసి పూసి మారెడుకాయ చేసింది. ఇదో గోల్మాల్ బడ్జెట్.
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దుర్మార్గం
కేంద్ర బడ్జెట్ సామాన్యులకు నిరాశాజనకంగా ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదలు, రైతులను నిస్పృహకు గురిచేసింది. ఆదాయ పన్నులో స్లాబుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సైతం శుభసూచకంగా లేదు.కరోనా కష్టకాలంలో వైద్య రంగంపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. కొవిడ్ కారణంగా వెనుకబడిపోయిన విద్యారంగాన్ని కాస్త గాడిన పెట్టేందుకుగానూ తీసుకొచ్చిన డిజిటల్ యూనివర్సిటీ స్వాగతించదగ్గదే. ఆహార, వ్యవసాయ రంగాలకు రాయితీలు ఇస్తారనుకున్నాం. కానీకన్నీరే మిగిల్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను వేగంగా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం దుర్మార్గం.ఓవరాల్‌గా కార్పొరేట్లు, మల్టీ నేషనల్ కంపెనీల కోసం తీసుకొచ్చిన బడ్జెట్‌లా కనిపిస్తున్నది.