
పార్టీ కోసం పనిచేయడం అదృష్టంగా భావించాలి
కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునే పార్టీ టీఆర్ఎస్
ప్రతిపక్షాల నుంచి వరదలా వలసలు
ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్, ఆగస్టు31(నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆఎస్ పార్టీ కోసం పనిచేసే వారు కింది స్థాయి వాైళ్లెనా సరే వారికి పదవులు దక్కుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రతిపక్షాల నుంచి వరదలా వస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం బీజేపీ నేతలు పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్కు ఎదురులేదని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాల్లో కార్యకర్తలకు, పనిచేసే వారికి గుర్తింపు దక్కడం లేదని అందుకే అన్ని పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు పెద్ద ఎత్తున ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సాధించడమే కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎంతో విలువైనదన్నారు. ఒకప్పుడు సాగునీరు లేక వలసలతో అల్లాడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రూపురేఖలు మారాయంటే సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. 70 ఏండ్లుగా అధికారంలో ఉన్న పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.
ఈనెల 2న జరిగే టీఆర్ఎస్ జెండా పండుగ సందర్భంగా ప్రతి వార్డులోనూ జెండా రెపరెపలాడాలన్నారు. ఈనెల 3నుంచే గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని కమిటీల్లోనూ పనిచేసే నిబద్ధత గల కార్యకర్తలు, నాయకులకే గుర్తింపు దక్కుతుందన్నారు. పార్టీకి పనిచేసే అవకాశాన్ని అదృష్టంగా భావించాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. అభివృద్ధి చేస్తున్న తమపై చెత్త వాగుడు వాగే వారిని పార్టీ కార్యకర్తలు సహించడం లేదని… తగిన గుణపాఠం చెబుతారన్నారు. అభివృద్ధి మాత్రమే తమకు తెలుసని… మిగతా చెత్త రాజకీయాలను పట్టించుకోమన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికేలా చూడటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి అన్నారు. మహబూబ్‌నగర్‌ను హైదరాబాద్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే మహబూబ్‌నగర్‌లో భూముల రేట్లు పదింతలు పెరిగిందన్నారు. భవిష్యత్తులో మహబూబ్‌నగర్ అంటేనే ఓ బ్రాండ్ లా మారుస్తామన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నేతలు
మహబూబ్‌నగర్ పట్టణంలోని 16వ వార్డు బోయపల్లికి చెందిన బీజేపీ గిరిజన మోర్చా పట్టణ అధ్యక్షుడు వి. రవికుమార్‌తో పాటు గోదా శివయ్య యాదవ్, జుర్రు శ్రీనివాస్‌యాదవ్, పురుగుల చంద్రశేఖర్, జుర్రు శ్రీశైలంయాదవ్, బదిగే రాజశేఖర్, రాజునాయక్, శ్రీను రాథోడ్, వెంకటయ్య, గోదా చిన్నరాములు, డీజే రాజు, వి.హనుమంతు, కొల్ల యాదయ్యలతో పాటు 100 మంది సభ్యులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, మున్సిపల్ వైస్‌చైర్మన్ గణేశ్ పాల్గొన్నారు.