
మరోసారి జూరాల డ్యాం గేట్లు ఓపెన్
24 రోజుల తర్వాత పెరిగిన వరద
10 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల
ఆత్మకూరు/అయిజ/శ్రీశైలం, ఆగస్టు 31 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తారు. ఈ ఏడాది సీజన్ ఆరంభంలోనే వరద నిలిచిపోవడంతో మూతబడిన గేట్లు మంగళవారం మరోమారు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో అధికారులు గేట్లను తెరిచారు. మధ్యాహ్నానికి 4 గేట్లు, సాయంత్రానికి 10 గేట్లను ద్వారా 41,400 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో జూలై 15న ప్రారంభమైన వరద జూలై 17న మొదటగా గెట్లెత్తారు. అప్పటి నుంచి ఉధృతంగా కొనసాగిన వరద 21 రోజులపాటు కొనసాగి ఆగస్టు 6న తగ్గుముఖం పట్టగా గేట్లు మూతబడ్డాయి. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 773, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 33,114 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాలలో 5 యూనిట్లు, దిగువ జూరాలలో 5 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిర్వహిస్తున్నారు. ఎగువ జూరాలలో ఒక్కరోజు 1.547 మిలియన్ యూనిట్లు.. ఇప్పటి వరకు మొత్తంగా 118.685 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. అలాగే దిగువ జూరాలలో ఒక్కరోజు 1.712 ఎం.యూ ఉండగా.. ఇప్పటి వరకు 127.843 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు ఉండగా సాయంత్రానికి 9.193 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 77.054 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తుంగభద్ర డ్యాంకు..
తుంగభద్ర జలాశయానికి 21,341 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. దీంతో మంగళవారం ఐదు గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 21,341 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 21 వేల క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి సామర్థ్యం 100.855 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 99.201 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులకుగానూ 1632.57 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు 9,310 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదైంది. 8,880 వేల క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 9 అడుగుల మేర నీటిమట్టం ఉండగా.. ప్రధాన కాల్వకు 430 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైల డ్యాంకు..
శ్రీశైలం డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం జూరాల ప్రాజెక్టు నుంచి 41,400 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 33,114 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 8,622 క్యూసెక్కులు మొత్తం 83,136 క్యూసెక్కులు విడుదల చేయగా.. సాయంత్రం 6 గంటల వరకు 39,836 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎడమగట్టు కేంద్రంలో 19,070 క్యూసెక్కుల నుంచి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు.