
విజ్ఞానం పెంపొందించేలా తరగతి గదులు.. విద్యార్థుల మనస్సులో పాఠాలు సజీవంగా నిలిచేలా గోడలపై రంగురంగుల బొమ్మలు.. అధునాతన కంప్యూటర్, గ్రంథాలయం, కార్యాలయ గదులు.. ప్రొజెక్టర్ సాయంతో పాఠాల బోధన.. కొల్లాపూర్ మండలం చింతలపల్లి రైలుబడి సొంతం. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కృషితో ఈ పాఠశాల కార్పొరేట్ స్థాయిలో హంగులద్దుకున్నది. ప్రభుత్వ ప్రోత్సాహానికి అధికారుల సహకారం, ఉపాధ్యాయుల అభిరుచితో
పాటుగా సమాజ చేయూత తోడవడంతో సర్కార్ బడిలో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఎస్సీఈఆర్టీ రైలుబడి శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 2012 నుంచి ఇప్పటి వరకు 80 మందికి పైగా విద్యార్థులు గురుకులాలకు ఎంపికయ్యారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’తో మరిన్ని ఈ బడిలో మౌలిక
వసతులు సమకూరనున్నాయి.
కొల్లాపూర్, జనవరి 30: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చింతలపల్లిలోని మండల ప్రాథమిక పాఠశాలలో సకల సౌకర్యాలతో కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన కొనసాగుతున్నది. ఐదు తరగతులకు మొత్తం 102 మంది విద్యార్థులున్నారు. విశాలమైన మైదానంతో పాఠశాలను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తన సొంతంగా రూ.5 లక్షలు అందించడంతో పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. రైలు బండిలో చదువుతున్నట్లుగా విద్యార్థులు అనుభూతిని పొందుతున్నట్లు చెబుతున్నారు. ఈ పాఠశాలలోని అన్నీ తరగతి గదులను రైలు బోగీల ఆకారంలోనూ, లోపల గదుల్లో గ్రీన్ బోర్డులు, ఫర్నీచర్, కంప్యూటర్లు, డిజిటల్ లైబ్రరీ, స్ఫూర్తినింపేలా జాతీయ నాయకుల చిత్రాలు..గోడలపై మానవ శరీరావయవాలు సూచించే అందమైన బొమ్మలు, తెలుగు అక్షరమాల, గుణింతాలు, అంకెలు, ఎక్కాలు, కూడికలు, తీసివేతలు రంగులతో వేయించారు. సొంతగ్రామంలో పంతుళ్లు మెరుగైన చదువులు చెబుతున్నట్లు తెలుసుకొని ఉపాధికోసం వలస వెళ్లిన తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇక్కడే సర్కార్ బడిలో చేర్పించారు. విద్యార్థులకు ప్రత్యేక బోధన తరగతులను నిర్వహించి గురుకులంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోనే 2012-13 సంవత్సరం నుంచి 2019-20 వరకు 96మంది విద్యార్థినీ, విద్యార్థులు సీట్లు సాధించి టాప్‌గా నిలిచారు. గత ఏడాది ఈ పాఠశాలను సందర్శించిన విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు సైతం సౌకర్యాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమంలో విద్యార్థులకు బోధన ప్రారంభించనుండడంతో తమ పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరనున్నదని విద్యార్థుల తల్లిదండ్రుల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమతున్నాయి. ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంతో మరిన్ని సౌకర్యాల కల్పనతో పాఠశాల సర్వాంగా సుందరంగా మారనున్నది.
ఇదీ పాఠశాల కథ…
2003లో కొల్లాపూర్ మండలం చింతలపల్లిలో మండల ప్రాథమిక పాఠశాల బైఫర్కేట్ అయింది. గ్రామస్తులు, పాఠశాల విద్యాకమిటీ సంఘటితమై గ్రామం వెలుపల ఎకరంపావు భూమిని సేకరించి ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులోనే 1నుంచి 5తరగతులను ఏర్పాటు చేశారు. అప్పట్లో కరువుకాటకాలతో తమపిల్లలను ఇంటి వద్దనే అవ్వ, తాతల వద్ద వదిలేసి తల్లిదండ్రులు పొట్టచేతపట్టుకొని వలసవెళ్తుండేవారు. దీంతో పిల్లల చదువుకు ఆటంకాలు జరిగేవి. 2011 జూన్‌లో ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎంగా కర్నె కృష్ణయ్య రావడం, ఆ తరువాత 2012లో ముగ్గురు ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎండీ రబ్బానీపాషా, హెచ్ శంకర్, జే సంగీత పాఠశాల విధుల్లో చేరారు.
ఎమ్మెల్యే రూ.5లక్షలు సాయం
చింతలపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుటకుగానూ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ్దన్‌రెడ్డి తన సొంతంగా రూ.5లక్షలు ఆర్థికసాయాన్ని ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డికి అందజేశారు. పాఠశాలకు కావాల్సిన ఫర్నీచర్, కంప్యూటర్స్, ప్రొజెక్టర్, టీవీ లాంటివి సమకూర్చాల్సిందిగా ఎంఈవోను ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో డీఈవో గోవిందరాజులును ఎంఈవో సంప్రదించారు. కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో ఉన్న ఇద్దరూ ఆర్ట్ టీచర్లు లక్ష్మణ్,కురుమూర్తిని డిప్యూటేషన్‌పై చింతలపల్లి పాఠశాలకు పంపించారు. తరగతి గదుల గోడలపై సైన్స్, సోషల్ పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలు, ప్రేరణ పొందేలా పాఠశాల బయట గోడలపై రైలుబండి మాదిరిగా చిత్రాలు వేశారు. పాఠశాలలో 250 మొక్కలను సంరక్షిస్తున్న స్కవెంజర్ పెద్దయ్యను ఎమ్మెల్యే బీరం అభినందించారు. ప్రహరీ కోసం రూ.12లక్షలు తక్షణం మంజూరు చేయగా నిర్మాణం పూర్తి చేశారు. సర్పంచ్ కల్మూరి నాగరాజు రూ.10వేలు వాటర్ మోటార్ అందించారు. పాఠశాల అభివృద్ధికి పాఠశాల చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ లక్ష్మీ, విద్యాకమిటీ కృషి చేస్తున్నది.
గురుకులాల్లో విద్యార్థులకు సీట్లు
2012-13సంవత్సరంలో గురుకుల పోటీ పరీక్షలు ఉండేవికావు. లాటరీ విధానంలో విద్యార్థుల ఎంపిక జరిగేది. గ్రామంలో నుంచి వలస వెళ్లిన తల్లిదండ్రుల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉపాధ్యాయులే 8మంది విద్యార్థులకు గురుకులానికి దరఖాస్తు చేశారు. అప్పట్లో నలుగురు విద్యార్థులు ఎంపికకావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. 2013-14 నుంచి లాటరీ పద్ధతిలో కాకుండా గరుకుల ప్రవేశ పరీక్షలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆరుగురు విద్యార్థులకు 5వ తరగతిలో చదువుట కోసం సీట్లు సాధించారు. అనిల్‌కుమార్‌ను విద్యావలంటీర్‌గా ఏర్పాటు చేసి గ్రామంలోని దాతల సహకారంతో గౌరవవేతనం అందిస్తూ వచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్నె కృష్ణయ్య సూచన మేరకు ఉపాధ్యాయ బృందం గురుకుల శిక్షణ, అకాడమిక్ క్యాలెండర్‌తో పాటు నవంబర్ నెల నుంచే గురుకుల శిక్షణను షురూ చేస్తూ వస్తున్నారు. ఉపాధ్యాయుడు శంకర్ రాత్రివేళ్లలో కూడా గ్రామ పెద్దల సహకారంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ప్రణాళికాబద్దంగా వెళ్లడం ద్వారా 2018-19లో 78మంది విద్యార్థులు గురుకులంలో సీట్లు సాధించారు.
జాతీయ స్థాయి గుర్తింపు..
చింతలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఎస్సీఈఆర్టీ జాతీయ స్థాయి గుర్తింపు కోసం ఎస్ఎల్డీపీ ఎడిషన్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి మూడు పాఠశాలలకు చోటు లభించింది. అందులో చింతలపల్లి ప్రాథమిక పాఠశాల ఒకటి. కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ స్కూల్లో ఉపాధ్యాయుల కృషి, సమాజం నుంచి అందుతున్న తోడ్పాటుతో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ ఆదర్శంగా నిలిచింది. ప్రాథమిక స్థాయిలో విద్యలో రాణిస్తూ సాధించి ఆంగ్లమాధ్యమంలో సత్తా చాటుతున్నారు. ఈ పాఠశాలలో సాధిస్తున్న విజయాలపై ఇటీవలే తెలంగాణ ఎస్సీఈఆర్టీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయాన్ని చింతలపల్లి పాఠశాల ఉపాధ్యాయులు గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పాఠశాలలను గుర్తించేందుకు ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్) గుర్తింపు కోసం నడుంబిగించింది. ఎస్ఎల్డీపీ(స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) విద్యార్థి అభివృద్ధికి ప్రతిభావంతంగా పని చేస్తున్న పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా రాష్ట్ర వ్యాప్తంగా 67అత్యుత్తమ పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లా మూడు పాఠశాలలకు ఎస్ఎల్డీపీలో చోటు లభించిందని పాఠశాల హెచ్ఎం కర్నె కృష్ణయ్య చెప్పారు.
సంతోషంగా ఉంది
చింతలపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రైలు బడిని ఎస్సీఈఆర్టీ గుర్తించడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచేందుకు మేము చేస్తున్న కృషికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో పాటు గ్రామస్తుల సహకారం మరువం. విద్యార్థులను ఆకర్షించేలా రైలులా రంగులతో తీర్చిద్దాం. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా గదుల్లోని కంప్యూటర్, సైన్స్ చిత్రాలు, బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. అందుకే పాఠశాలను వీక్షించేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది. రోజుకు రెండు, మూడు బృందాలుగా ఈ బడికి సందర్శకులు వచ్చి తరగతులను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. అచ్చంగా రైలును పోలిన విధంగా చిత్రం ఉండడంతో సందర్శకులు వచ్చి ఫొటోలు దిగుతున్నారు.