
ఆరోపణలు నిరూపించకుంటే పరువునష్టం దావా వేస్తాం
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 21 : మహబూబ్‌నగర్ మండలంలోని కోడూరు గ్రామంలో ఎకరా భూమి కూడా కబ్జా కాలేదని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు భూములను కబ్జా చేశారని రాజ్‌న్యూస్ చానల్ చేసిన ఆరోపణలను నిరూపించకుంటే పరువునష్టం దావా వేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కోడూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వర్‌గౌడ్ మాట్లాడారు. కోడూర్ చెరువు శిఖం 101ఎకరాలు ఉండగా, ముగ్గురికి 13 ఎకరాల్లో పట్టా చేశారని తెలిపారు. పట్టా భూములతోపాటు 90ఎకరాల్లో చెరువునీరు నిల్వ ఉన్నదని చెప్పారు. అయితే తాను 85ఎకరాలు కబ్జా చేశానని రాజ్‌న్యూస్ చానల్లో తప్పు డు ప్రచారం చేయడం సరికాదన్నారు. అలాగే సర్వేనంబర్ 31లో 119ఎకరాల్లో ప్రభుత్వం ఆసైన్డ్ పట్టాలు ఇచ్చిందని, మిగిలిన 10 ఎకరాల్లో రైతువేదిక, క్రిమిటోరియం, డబుల్బెడ్రూం ఇండ్లు, కేజీబీవీ, పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. భూములు కోల్పోయిన దళితులకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని ఓర్వలేక కొంతమంది లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. దీనిపై సంబంధిత భూమిలోనే చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆరోపణలు రుజువు చేయకుంటే రాజ్‌న్యూస్ చానల్‌పై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కాడం ఆంజనేయులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులుయాదవ్, సర్పంచ్ శ్రీకాంత్‌గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసులు, పాం డురంగారెడ్డి, సురేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.