
మహబూబ్‌నగర్ టౌన్, అక్టోబర్ 7 : మారుమూల ప్రాంతాలకు సైతం రహదారి సౌకర్యాలను కల్పించి మహబూబ్‌నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాసానిపల్లి బీసీ కాలనీ నుంచి ఎర్రవల్లి తండా వరకు రూ.22.7 లక్షల వ్యయంతో నిర్మించనున్న మెటల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తండావాసులు రహదారి లేక ఇబ్బందులు పడ్డారని, ప్రభు త్వం ఈ తండాకు తాగునీటితోపాటు పాఠశాల భవనాన్ని, మట్టి రోడ్డును మంజూరు చేసిందని తెలిపారు. అయితే ఇటుక బట్టీల వల్ల ప్రస్తుతం ఉన్న రహదారి కొంత భాగం దెబ్బ తిన్నందున వెంటనే మొత్తం రహదారి వేసేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం రహదారులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇటుక బట్టీలపై ఆధాపడి ఎందరో జీవనం సాగిస్తున్నారని, వారిని దృష్టిలో ఉంచుకొని ఒకేచోట వీలైతే 50 ఎకరాల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేసేలా స్థలం గుర్తించాలని కలెక్టర్ వెంకట్రావుకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, కౌన్సిలర్ జంగమ్మ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, నాయకులు పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు.