
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకృతి ప్రేమికుడు.. ఆయన తీసుకున్న చర్యలతో పార్కుల సంఖ్య పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌లో 2 పార్కులు మాత్రమే ఉండగా.. తెలంగాణ వచ్చాక ఈ సంఖ్య 47కు చేరింది. దీంతో పాలమూరు ఒడిలో ఆహ్లాదం పెరిగింది. నూతనంగా ఏర్పాటైన పార్కులే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. అందుకే గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మహబూబ్‌నగర్ పార్కుల ప్రస్తావన వచ్చింది. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. పర్యాటకులు భారీగా సందర్శిస్తున్నారని చెప్పారు. ఇక్కడి పార్కుల ప్రస్తావన తెచ్చిన కేటీఆర్‌కు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్‌ను మించిన ప్రకృతి ప్రేమికుడు మరొకరు లేరని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో రూరల్ పోలీస్‌స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన పార్కు చిత్రాన్ని అసెంబ్లీలో చూయించారు. హరితహారం ద్వారా పచ్చదనం పెంపునకు బడ్జెట్లో 10 శాతం నిధులను కేటాయిస్తున్న ముఖ్యమంత్రి.. దేశంలో మరెవరూ లేరన్నారు. ప్రకృతి ప్రేమికుడి పేరిట మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు దేశంలోనే అతి పెద్దదని సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సభలోని అందరి దృష్టి పాలమూరుపై పడింది. ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉండి.. ఉపాధి కరువై పొట్ట చేతపట్టుకుని ముంబై తదితర దూర ప్రాంతాలకు వలస వెళ్లిన పాలమూరు ఇదేనా అనిపించేలా అభివృద్ధి జరుగుతుందని చెప్పేందుకు కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు, పట్టణంలో ఏర్పాటు చేసిన నూతన పార్కులు ఉదాహరణగా నిలుస్తున్నాయని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును పాలమూరులో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అసెంబ్లీలో పాలమూరు పార్కులను ప్రస్తావించినందుకు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మహబూబ్‌నగర్ పట్టణంలో తెలంగాణకు ముందు కేవలం రెండు పార్కులు మాత్రమే ఉండగా.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ సంఖ్య 47కు చేరుకున్నదన్నారు. దీన్ని బట్టి హరిత ప్రేమికుడు ఎవరో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రస్తుతం 33 పట్టణ ప్రకృతివనాలు, 14 పార్కులున్నాయన్నారు.
హరితనిధికి మేము సైతం..
మరోవైపు హరితహారాన్ని సమున్నత స్థానానికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ హరిత నిధి ఏర్పాటు చేశారు. ఇం దుకు అన్ని వర్గాలు తమ వంతు పాత్ర పోషించేలా నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సేవల ద్వారా నిధికి నెలనెలా నిధులు పోగయ్యేలా సర్కార్ నిర్ణయించింది. మరోవైపు ఈ హరిత నిధికి స్వచ్ఛందంగా తా ము సైతం సహకరిస్తామంటూ వివిధ వర్గాల ప్రజలు ముం దుకొస్తున్నారు. హరిత పాలమూరుగా మార్చేందుకు హరి తనిధి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.