
కొల్లాపూర్, అక్టోబర్ 7 : రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డాక్యుమెంట్లు ఇచ్చేందుకు రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ తాసిల్దార్, వీఆర్ఏ, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో చోటు చేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ కథనం మేరకు.. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామానికి చెందిన రైతు బండారు స్వామి తన అక్క పేరు మీద నార్లాపూర్ శివారులో సర్వేనంబర్ 308లో ఉన్న 5 ఎకరాల 20 గుంటల భూమి కొనుగోలు చేశాడు. గత నెల 15న స్లాట్ బుకింగ్ చేసుకొని 17న రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించి ఏడు డాక్యుమెంట్లు పూర్తయ్యాయి. వీటిని ఇవ్వాలని రైతు స్వామి అధికారులను అడుగగా.. ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.2500 ఇస్తేనే వాటిని ఇస్తామని వీఆర్ఏ కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ శివ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాసిల్దార్ షౌకత్అలీకి ఫిర్యాదు చేయగా.. తమకూ ఖర్చులుంటాయని చెప్పాడు. దీంతో అంత మొత్తం ఇచ్చుకోలేనని రూ.12 వేలు ఇస్తానని సదరు రైతు ఒప్పుకొన్నాడు. అనంతరం ఈ విషయాన్ని ఏసీబీ అధికారులను కలిసి వివరించాడు. ముందుగానే అనుకున్న పథకం ప్రకారం గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో రైతు స్వామి రూ.12 వేలను వీఆర్ఏ కృష్ణ, ఆపరేటర్ శివకు అందజేస్తుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.
వీరితోపాటు తాసిల్దార్‌ను కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీరిని శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా అధికారులు లంచం అడిగితే ట్రోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.