
ప్రతి విద్యార్థికీ కరోనా పరీక్ష చేయించాలి
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పరిశీలన
అక్రమ డబ్బాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు
కోస్గి, సెప్టెంబర్ 7 : పాఠశాలల్లో విద్యార్థులపై ఉపాధ్యాయులు జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి కరోనా రావడంతో రెండు రోజులపాటు బడికి సెలవు ప్రకటించారు. తిరిగి పాఠశాల ప్రారంభం కావడంతో మంగళవారం పాఠశాలలో వైద్యాధికారులు కొవిడ్ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రతి విద్యారికీ కరోనా పరీక్ష నిర్వహించారు. క్యాంపును అదనపు కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు కరోనాపై జాగ్రత్తలను తెలియజేయాలన్నారు.
డబ్బాలను తొలగించాలి
మున్సిపాలిటీ పరిధిలోని శివాజీ చౌరస్తాలో రోడ్లకు ఇరువైపులా నిర్మించుకున్న అనుమతి లేని అక్రమ డబ్బాలను తొలగించాలని అదనపు కలెక్టర్ కమిషనర్ మల్లికార్జునస్వామికి సూచించారు. వారం కిందట అందరికీ నోటీసులు అందించామని కమిషనర్ చెప్పడంతో అన్ని తొలగించి కార్యాలయ స్థలం సర్వే చేయించాలన్నారు. అనంతరం నాగసాన్పల్లి శివారులో డంపింగ్ యార్డుకు కేటాయించిన 7 ఎకరాల 24 గుంటల భూమిని పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బాలేశ్ శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.