
పెరిగిన వేగం.. సకాలంలో వస్తున్న రైళ్లు
డిసెంబర్ నాటికి సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ లైన్ పూర్తి
113 కిలోమీటర్లలో ఇప్పటికే 88 కి.మీ. పూర్తి
గొల్లపల్లి నుంచి పాలమూరు వరకు పనులు
విమానాశ్రయానికి, వివిధ నగరాలకు పెరగనున్న కనెక్టివిటీ
డబ్లింగ్ లైన్ పూర్తి కావడంతో రైళ్ల రాకపోకల్లో వేగం పెరిగింది. క్రాసింగ్‌ల వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు తొలగడంతో ప్రయాణం సాఫీగా సాగుతున్నది. సికింద్రాబాద్- డోన్ రైల్వే మార్గం పనుల్లో ఓ అడుగు పడింది.
మహబూబ్‌నగర్- సికింద్రాబాద్ మధ్య ఉన్న 113 కి.మీ. దూరం పనులను రూ.774 కోట్లతో చేపట్టారు. ఇప్పటికే 88 కి.మీ. మేర డబ్లింగ్, విద్యుద్దీకరణ పూర్తవగా.. గొల్లపల్లి-మహబూబ్‌నగర్ మధ్య పనులు జరుగుతున్నాయి. పూర్తయిన మార్గంలో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. అత్యాధునిక
సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన లైన్‌పై రైళ్ల వేగాన్ని 130 కి.మీ.కు పెంచారు. ఈ లైన్ పూర్తయితే శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పాలమూరు, కర్నూల్, బెంగళూరు, అనంతపురం, కడప, తిరుపతి, చెన్నై వంటి ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ మెరుగుకానున్నది.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన రైల్వేలైన్ అయిన సికింద్రాబాద్- డోన్ రైల్వే మార్గంలో డబ్లింగ్ పనుల్లో ఓ అడుగు ముందుకు ప డింది. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య ఉన్న 113 కి.మీ. రైల్వే మార్గంలో ఇప్పటికే 88 కి.మీ. మేర డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు పూర్తయి రైళ్లు కూడా తిరుగుతున్నా యి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొత్త లైన్‌తో ఈ మార్గంలో రైళ్ల వేగాన్ని 130 కి.మీ.కు పెం చారు. దీంతో సకాలంలో గమ్యస్థానానికి చేరే అవకాశం ఏర్పడింది. ప్రయాణికులకు క్రాసింగుల ఇబ్బందులు తీరి రైళ్లు సకాలంలో రాకపోకలు సాగించే వీలైంది. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మార్గంలో మరో 25 కి.మీ. పను లు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్ర స్తుతం సికింద్రాబాద్ నుంచి షాద్‌నగర్-గొల్లపల్లి వరకు డబుల్ లైన్లో రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. డబ్లింగ్ పనులు జరిగినంత వరకు రైళ్లు సకాలంలో ప్రయాణించే అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మిగతా ప నులు సైతం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు, అనంతపురం, కడప, తిరుపతి, చెన్నై మొదలైన ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ మె రుగుపడుతుందని భావిస్తున్నారు.
ఆరేండ్ల సమయం పట్టింది..
రైల్వే లైన్ల కేటాయింపు, నిధుల విడుదలలో ఆది నుం చి దక్షిణాదికి అన్యాయమే జరుగుతున్నది. ఎప్పటి నుం చో సింగిల్ లైన్, డీజిల్ ఇంజన్లకే పరిమితమైన తెలంగాణలోని అనేక రైల్వే లైన్లపై ఇన్నాళ్లూ కేంద్రం శీతకన్ను వే స్తూ వచ్చింది. 2015-16లో రూ.774 కోట్లతో రైల్ వికా స్ నిగం లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) చేపట్టిన సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. గతేడాది కరోనా కారణం గా పనులు మరింత ఆలస్యమయ్యాయి. సికింద్రాబాద్ నుంచి ఉందానగర్ వరకు ఎంఎంటీస్ విస్తరణలో భాగం గా ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు 28 కి.మీ. మేర డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు పూర్తి చేశారు. అంతకుముందే షాద్‌నగర్ నుంచి గొల్లపల్లి వరకు 29 కి.మీ. మేర డబ్లింగ్ పనులు 2020 సెప్టెంబర్ 16 నాటికి పూర్తికాగా.. ఆ తర్వాత ఉందానగర్-షాద్‌నగర్ మధ్య మిగతా పనులు పూర్తి చేశారు. దీంతో సికింద్రాబాద్-ఫలక్‌నుమా-షాద్‌నగర్-గొల్లపల్లి వరకు 88 కి.మీ. మేర డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు పూర్తయి వారం రోజుల కిందటి నుంచి రైళ్లు తిరుగుతున్నాయి. దీంతో రైళ్ల రాకపోకల్లో ఆలస్యానికి అవకాశమే లేకుండా పోయింది. దాదాపుగా ఈ మార్గంలో తిరిగే ప్రతి రైలు సకాలంలో గమ్యస్థానానికి చేరుకుంటుందని, కొన్ని రైళ్లు నిర్ణీత సమయానికంటే ముందుగానే వస్తున్నాయని అధికారులు తెలిపారు.
భవిష్యత్‌లో మరిన్ని రైళ్లు..
మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ డబ్లింగ్ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నది. ప్ర స్తుతం సికింద్రాబాద్ నుంచి జడ్చర్లకు సమీపంలో ఉన్న గొల్లపల్లి వరకు డబ్లింగ్ పనులు పూర్తయి గత వారమే రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. దక్షిణ మ ధ్య రైల్వే పరిధిలోనే ఈ మార్గం ఎంతో కీలకమైనది. హై దరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా సాగే మా ర్గంలో బెంగళూరు, చెన్నై, తిరుపతి, కోయంబత్తూర్ వంటి దక్షిణాది నగరాలను చేరుకునేందుకు దగ్గరి మా ర్గం అవుతుంది. ఈ మార్గానికి సమాంతరంగా గుంతక ల్ నుంచి డోన్, కర్నూల్, గద్వాల మీదుగా మహబూబ్‌నగర్ వరకు సైతం డబ్లింగ్ పనులు చేపట్టి త్వరగా పూర్తి చేసేలా రైల్వే శాఖ ప్రయత్నిస్తున్నది. దీంతో భవిష్యత్‌లో ఈ మార్గంలో రైల్వే ప్రయాణికులతోపాటు సరుకు రవాణాకు సైతం ఎంతో ఉపయోగంగా మారనున్నది.
డబ్లింగ్, విద్యుద్దీకరణతో ప్రయోజనాలు..
సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మార్గంలో అధునాతన స్టేషన్ భవనాలు, ఆధునిక వసతులు, నూతన ఫ్లాట్ ఫారాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, తాగునీటి సౌకర్యం కల్పించారు. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాట్లు చేశారు. కొత్తగా వేసిన ట్రాక్‌తోపాటు అప్పటికే ఉన్న ట్రాక్‌పై గంటకు 130 కిలోమీటర్ల వేగంతో 25 టన్నుల యాక్సిల్ లోడ్ రైళ్లు, గూడ్స్ ప్రయాణించేలా తీర్చిదిద్దారు. దీంతో మహబూబ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా చేరుకునేందుకు 113 కి.మీ. దూరానికి గతంలో 1.40 గంటలు పడితే ఇప్పుడు 1.10 గంటల్లో చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇక ప్యాసింజర్ రైళ్లకు డబ్లింగ్ ద్వారా ఈ మార్గంలో 2 గంటలు పట్టనున్నది. గతంలో సింగిల్ ట్రాక్‌పై ప్రయాణించేందుకు తరచూ క్రాసింగులు పడి రైళ్లలో గంటల కొద్దీ నరకయాతన అనుభవించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ బాధ తప్పిందని ప్రయాణికులు అంటున్నారు. డబ్లింగ్ పనులు దాదాపుగా పూర్తి కావడంతో మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య లోకల్ ట్రైన్స్ తిప్పే అవకాశం ఉన్నది. ఉందానగర్ స్టేషన్ ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ పెరుగుతుంది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రైల్వే లైన్ ఏర్పాటుతో ప్రమాదాలు సైతం దాదాపుగా తగ్గిపోయాయి. రైల్వే ప్రయాణం చౌకగా సాగడమే కాకుండా తక్కువ ధరల్లో వేగంగా ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకునేందుకు వీలవుతుంది.