వరి పోరు ఉధృతమైంది. మొదటి విడుత సూపర్ సక్సెస్ కాగా.. రెండో విడుతకు మంత్రి కేటీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించడంతో గులాబీ దళం కదం తొక్కింది. సోమవారం మండల కేంద్రాల్లో నిరసన దీక్షలతో హోరెత్తించారు. నల్లాజెండాలు చేతబూని ఆందోళనబాట పట్టారు. మద్దతుగా రైతన్నలు కదలిరాగా.. ఉద్యమంలా టీఆర్ఎస్ శ్రేణులు కదిలారు. విజ్ఞప్తులు, విన్నపాలకు కేంద్రం వినకపోవడంతో ప్రత్యక్ష పోరాటంతో అట్టుడికించారు. ‘సీఎం కేసీఆర్ జిందాబాద్.. ప్రధాని మోదీ డౌన్ డౌన్’ నినాదాలు నింగినంటాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి, జైపూర్ మండల కేంద్రాల్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. కేంద్రం మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తామని, రైతన్నలకు ఎల్లప్పుడు టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసనలు హోరెత్తాయి. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, నాయకులు కట్టెల మోపు ఎత్తుకొని, ఖాళీ సిలిండర్లలో క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ పాల్గొన్నారు. బోథ్ బస్టాండ్ ఎదుట నిర్వహించిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నిరసన దీక్ష చేపట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ రైతులతో కలిసి నల్లాజెండాలు పట్టుకొని నిరసన దీక్ష చేపట్టారు.
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అన్ని ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట మహా నిరసన దీక్ష చేపట్టారు. మందమర్రి, జైపూర్ మండల కేంద్రాల్లో ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, బెల్లంపల్లి, తాండూర్, నెన్నె ల, కాసిపేట, కన్నెపల్లి మండల కేంద్రాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, కోటపల్లి మండల కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ పాల్గొన్నారు. మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షలో చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్ పాల్గొన్నారు. బెల్లంపల్లిలో వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఆయా మండలాల్లో ప్రజాప్రతినిధులు, రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట సోమవారం టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్(టీ) తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు. కౌటాల తహసీల్ కార్యాలయం ఎదుట రైతుబంధు సమితి అధ్యక్షుడు విశ్వనాథ్, జైనూర్‌లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు పాల్గొన్నారు. కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిప్రతాలు అందించారు. ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.