సారపాక, మే 15: ఆయనొక సామాన్య వ్యక్తి.. చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.. వచ్చే ఆదాయం కొద్దిగానే అయినా సేవ చేయాలనే హృదయం చాలా గొప్పది. వృద్ధుల కోసం ‘ఒక హృదయం వృద్ధాశ్రమం’ ప్రారంభించాడు. రోజూ దగ్గరుండి వారి ఆలనాపాలనా చూస్తూనే.. మరోవైపు సమాజ సేవకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే సారపాకకు చెందిన చిరు వ్యాపారి మిట్టకంటి సంజీవరెడ్డి.
సారపాకలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో అద్దె భవనంలో మూడేళ్ల క్రితం ‘ఒక హృదయం వృద్ధుల ఆశ్రమం’ ప్రారంభించాడు. అనాథలుగా మిగిలిన వృద్ధులతోపాటు అందరూ ఉండి ఆదరణ కరువైన వారు తన ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. తనకున్న దానిలోనే ఆశ్రమంలో వృద్ధులకు అన్నీ తానై దాతల సాయంతో వారి అవసరాలను తీర్చుతున్నాడు.
ఆశ్రమం సమీపంలోనే చిరు వ్యాపారం చేస్తూనే వచ్చిన అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూనే వృద్ధులకు తనవంతుగా సహాయం అందిస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆశ్రయం పొందుతున్న 10 మంది వృద్ధులకు సేవలందిస్తున్నాడు. అంతేకాకుండా వృద్ధుల సంరక్షణకు నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వారికి నిత్యం సేవలందిస్తున్నాడు.
ఆశ్రమంలో వృద్ధుల బాగోగులతో పాటు మరోవైపు ఒక హృదయం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో జిల్లాలో సమాజసేవ చేస్తున్నారు మిట్టకంటి సంజీవరెడ్డి. బాల కార్మికుల నిర్మూలన, మహిళలకు స్వయం ఉపాధి, శిక్షణా కార్యక్రమాలు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, వృద్ధులకు పొగతాగే అలవాటు ఉంటే మాన్పించడం తదితర వాటిపై వారికి అవగాహన కల్పిస్తున్నాడు. జిల్లాలో అన్ని మండలాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు. మండల లీగల్ సర్వీస్‌లో భాగంగా జిల్లాలో 300 గ్రామాల్లో న్యాయ అవగాహన సదస్సుల్లో ఎన్జీవోగా సేవలందించినందుకు మిట్టకంటికి అరుదైన అవార్డు దక్కింది.
ఎదుటి వారికి సాయం, సేవ చేయడంలోనే సంతృప్తి కలుగుతుంది. వృద్ధుల కోసం ఆశ్రమం స్థాపించాను. తనతో పాటు నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వృద్ధులకు చేదోడు వాదోడుగా ఉంటున్నా. ఆశ్రమంలో ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలతో పాటు అన్నదానాలు చేస్తుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ప్రజలు సాయం చేస్తున్నారు. ఆశ్రమానికి దాతలు సహకారం అందిస్తే మరింత సేవ చేస్తా.
– మిట్టకంటి సంజీవరెడ్డి, ఒక హృదయం వృద్ధుల ఆశ్రమ వ్యవస్థాపకుడు, సారపాక