Gandhari | ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారి’ ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ లేకుండానే నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 3, 2026 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే సాధారణంగా నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సినిమాలు అర్ధరాత్రి 12 గంటల నుంచే అందుబాటులోకి వస్తాయని భావించిన ప్రేక్షకులకు ఈసారి కాస్త భిన్నమైన సమయం ఎదురైంది.‘గాంధారి’ సినిమా సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నప్పటికీ.. అర్ధరాత్రి 12 గంటలకే స్ట్రీమింగ్ అవుతుందని చాలామంది భావించారు. అయితే ఈ సినిమా మధ్యాహ్నం 12:30 గంటలకు (IST) స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
అందువల్ల తాప్సీ అభిమానులు, ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులు మరో కొన్ని గంటలు వేచి చూడాల్సి ఉంటుంది. ‘గాంధారి’ కథలో తాప్సీ పన్ను బాణి అనే తల్లి పాత్రలో కనిపించనుంది. తన చిన్నారి కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునే తల్లికి ఓ దారుణమైన పరిస్థితి ఎదురవుతుంది. ఓ క్రూరమైన దాడి సమయంలో బాణి తాత్కాలికంగా చూపును కోల్పోతుంది. అదే సమయంలో ఆమె చిన్నారి కూతురు కిడ్నాప్‌కు గురవుతుంది. కళ్లముందే జరిగిన ఈ విషాదంతో బాణి పూర్తిగా కుంగిపోతుంది. అయితే తన కూతురిని ఎలాగైనా తిరిగి తీసుకురావాలనే పట్టుదలతో ముందుకు సాగుతుంది. కూతురిని అపహరించినది సాధారణ నేరస్థుల ముఠా కాదని బాణికి తెలుస్తుంది. ప్రమాదకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ సిండికేట్ వెనుక తన కూతురు చిక్కుకుందని తెలుసుకున్న ఆమె.. వారిని ఎదుర్కొనేందుకు తనను తాను సిద్ధం చేసుకుంటుంది.
ఇప్పటివరకు సాధారణ జీవితాన్ని గడిపిన ఓ తల్లి.. పరిస్థితులు తనను ఓ ఫైటర్‌గా మార్చుకునేలా చేస్తుంది. శారీరకంగా, మానసికంగా శిక్షణ తీసుకుని.. తన కూతురిని తిరిగి తీసుకురావడానికి నేర ప్రపంచంతోనే పోరాటానికి దిగుతుంది. ఈ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, తల్లి-కూతుళ్ల బంధం, క్రైమ్ థ్రిల్లర్ అంశాలు కలగలిపి సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ‘గాంధారి’లో తాప్సీ పన్నుతో పాటు ఇష్వాక్ సింగ్ కీలక పాత్రలో నటించారు. వీరిద్దరి పాత్రల చుట్టూనే కథ ప్రధానంగా సాగనున్నట్లు సమాచారం. ‘పాతాల్ లోక్’ వంటి వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇష్వాక్ సింగ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనున్నారనేది ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో తాప్సీ, ఇష్వాక్ సింగ్‌లతో పాటు ఛాయా కదమ్, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్, జతిన్ సర్నా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరి పాత్రలు కథలో ఎలాంటి మలుపులు తీసుకురానున్నాయనేది సినిమా చూసిన తర్వాతే పూర్తిగా తెలియనుంది.