Dulquer Salmaan | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ విడుదల రోజే అనూహ్య సమస్యను ఎదుర్కొంది. ‘RDX’ ఫేమ్ దర్శకుడు నహాస్ హిదాయత్ తెరకెక్కించిన ఈ సినిమాపై మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కయాదు లోహర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే తెలుగు వెర్షన్‌కు సంబంధించి అనుకున్న విధంగా రిలీజ్ జరగలేదు. ‘ఐయామ్ గేమ్’ తెలుగు వెర్షన్‌కు ఉదయం నుంచే థియేటర్లలో షోలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సినిమా కంటెంట్ థియేటర్లకు సమయానికి చేరకపోవడంతో తెలుగు మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినట్లు సమాచారం.
దీంతో ఇప్పటికే బుక్ అయిన కొన్ని షోలు కూడా థియేటర్ లిస్టింగ్స్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల కోసం థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఈ పరిణామం కొంత నిరాశ కలిగించింది. తెలుగు వెర్షన్ కంటెంట్ ఆలస్యంగా థియేటర్లకు చేరడం వల్ల సమస్య తలెత్తినట్లు తెలుస్తుండగా.. ఇదే తరహా ఇబ్బంది ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు ఇతర భాషలకూ ఎదురైందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఒకేలా ఉందా? లేక కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ ఆలస్యం జరిగిందా? అనే విషయంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. తెలుగు షోలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కంటెంట్ థియేటర్లకు చేరిన వెంటనే షోలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
‘ఐయామ్ గేమ్’ కథ యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో సాగనుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా.. కయాదు లోహర్ కథానాయికగా నటించారు. చిత్రంలో ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కదిర్, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథలో యాక్షన్‌తో పాటు క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘RDX’ సినిమాతో యాక్షన్ ఎంటర్టైనర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోతో ఆయన తెరకెక్కించిన సినిమా కావడంతో ‘ఐయామ్ గేమ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, కథలో వచ్చే ట్విస్టులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. యాక్షన్ థ్రిల్లర్ కథకు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు కీలకంగా ఉండనుందని తెలుస్తోంది.