‘ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలి.. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాబోధన ఆంగ్లమాధ్యమంలోనే జరగాలి..’ అన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు- మన బడి’ పథకం అమలు చేస్తున్నది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నది.. మరోవైపు విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవ్వాలనే ఉద్దేశంతో పాఠ్యపుస్తకాలను రెండు భాషల్లో ముద్రిస్తున్నది.. ఒకే పుస్తకంలో పేజీలో ఒకవైపు ఆంగ్లంలో ఉన్న పాఠాన్ని పక్కన పేజీలో తెలుగులో ఉండేటట్లు అందుబాటులోకి తీసుకురానున్నది..
– కొత్తగూడెం, మే 14
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 12 : 2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు అమలుకు టీఆర్ఎస్ సర్కారు శ్రీకారం చుట్టింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధన చేసే సమయంలో తొలినాళ్లలో వారు ఆ భాషను అర్థం చేసుకోలేరనే ఉద్దేశంతో విద్యాశాఖ మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు సౌలభ్యం కోసం ప్రత్యేక బై లింగ్యువల్ పుస్తకాలను వారికి అందించనుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ పాఠ్య పుస్తకాలు రెండు భాగాలుగా ఉంటాయి.
ఆంగ్లంలో దానికి పక్క పేజీలో తెలుగులో పాఠాలు ఉంటాయి. తద్వారా ఆంగ్లంలో ఉన్న పాఠ్యంశాల అర్థాలను పక్క పేజీలో చూసి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవచ్చు. పాఠాలను ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేయడంతో ఉపాధ్యాయులకూ బోధించడంపై ఆసక్తి పెరుగుతుంది. ఈ నూతన పుస్తకాలతో విద్యార్థులకు అందే పాఠ్య పుస్తకాలు రెండింతలు కానున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యావ్యవస్థలో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్యని అందించడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. గురుకులాల ద్వారా మరో ముందడుగు పడింది. ఇప్పుడు ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వం విద్యావ్యవస్థ రూపురేఖలు మారనున్నాయి. బడులు మరింత అభివృద్ధి చెందనున్నాయి. ఇందులో భాగంగా 2022-23 విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 791 ప్రాథమిక, 176 ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన ప్రారంభం కానుంది.
ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యాంశాలను బోధించేందుకు జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. ఇప్పటికే 2,700 మంది ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయులు, 970 మంది ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు శిక్షణ పొందారు. వారం రోజుల్లో మొదటి విడత ఆన్లైన్ శిక్షణ తరగతులు పూర్తి కానున్నాయి. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఎలా బోధించాలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం శుభసూచికం. దీంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుంది. దీంతోపాటు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించాలన్న ఆకాంక్ష నెరవేరుతుంది. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్య అందిస్తున్న సుశిక్షితులైన ఉపాధ్యాయుల వద్ద అభ్యాసన చేయాలి. ఉపాధ్యాయులు గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఆంగ్ల మాధ్యమం ప్రాముఖ్యతను తెలిపి విద్యార్థుల నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
-సోమశేఖరశర్మ, డీఈవో