కార్పొరేషన్, మే 11: ప్రజారోగ్యంపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మంజూరు చేస్తున్న పట్టణ ప్రగతి నిధులతో నగరాలు, పట్టణాల్లో వైకుంఠధామాలు, పార్కులు, మరుగుదొడ్లు, ప్రజల ఆరోగ్యం కోసం అవసరమైన ఇతర పనులు చేపట్టాలని సూచించింది. దీంతో కరీంనగర్ నగరపాలక సంస్థలో పట్టణ ప్రగతి నిధులతో పార్కులు, వైకుంఠధామాలతో పాటు ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. మేయర్ వై సునీల్‌రావుతో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వినియోగంలోకి తీసుకువచ్చారు.
కరోనాతో ప్రజల్లో ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెంచుకునే విషయంలో అవగాహన పెరిగింది. వీటితో పాటు అనునిత్యం ఉత్సాహంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్న ఆలోచనలు పెరిగాయి. దీంతో నగరంలో ప్రస్తుతం ఉదయం, సాయంత్రం మైదానంలో నడిచే వారు, జాగింగ్ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇందుకు అనుగుణంగా నగరపాలక సంస్థ అధికారులు కూడా పనులను ప్రారంభించారు.
నగరపాలక సంస్థకు వచ్చిన పట్టణ ప్రగతి నిధుల్లోంచి రూ. 80 లక్షలతో 9 ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్‌లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే జ్యోతిబా ఫూలే మైదానంలో సింథటిక్ ట్రాక్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే, మార్క్‌ఫెడ్ మైదానం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సప్తగిరికాలనీ ప్రభుత్వ పాఠశాల, హౌసింగ్‌బోర్డు కాలనీలో, గిద్దెపెరుమాండ్ల ఆలయం సమీపంలో వాకింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు.
నగరంలో ప్రస్తుతం వినియోగంలోకి వచ్చిన వాకింగ్ ట్రాక్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మానేరు డ్యాం కట్ట వెంట సుమారు రెండు కిలోమీటర్ల మేరకు నూతన ట్రాక్ పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో పాటు ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం, ఇతర ప్రాంతాల్లోనూ ట్రాక్‌లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, పలు డివిజన్ల ప్రజల నుంచి వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు వస్తున్నాయని, అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అధికారవర్గాలు తెలిపాయి.
నగరంలో చేపడుతున్న వాకింగ్ ట్రాక్‌లన్నింటినీ అతి త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు సరిగా పనులు చేయకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటున్నం. ఇతర ప్రాంతాల్లో ఆయా విభాగాలతో స్థలం కేటాయింపు విషయంలోనూ చర్చిస్తున్నం. ఇప్పటికే అనేక వాకింగ్ ట్రాక్‌లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినం. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నం.
– వై సునీల్‌రావు, మేయర్