హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా దారులన్నీ కొండగట్టువైపే కదులుతున్నాయి. శనివారం చిన్న జయంతి కాగా, శుక్రవారం రాత్రి వరకే గుట్ట పరిసరాలు కిక్కిరిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో సందడిగా మారాయి. నేడు పెద్దసంఖ్యలో మాల విరమణ చేయనుండగా, అధికారులు సర్వం సిద్ధం చేశారు. గుట్టపైన చలువ పందిళ్లు.. నీటి వసతి, ఘాట్ రోడ్డు, నాచుపల్లి దారులపై జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు.
కొండగట్టు కిక్కిరిసింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కాషాయమయమైంది. హనుమాన్ చిన్న జయంతిలో భాగంగా రెండో రోజు దీక్షాపరులు పెద్ద సంఖ్యలో వచ్చి, మాల విరమణ చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. నేడు చిన్న జయంతి సందర్భంగా రాత్రి వరకు దాదాపు 50వేల మంది రాగా, అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.
మల్యాల, ఏప్రిల్ 15 : అంజన్న చిన్న జయంతి సందర్భంగా కొండగట్టుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. గురువారం నుంచే జయంత్యుత్సవాలు మొదలు కాగా, మొదటి రోజు నుంచే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే స్వామి వారి జయంతి శనివారం రోజున మాల విరమణ చేస్తే మంచి జరుగుతుందని దీక్షాపరుల విశ్వాసం. శుక్రవారం సాయంత్రం వరకే వేలాదిగా చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు దాదాపు 50 వేల మంది వచ్చారు. వీరంతా నేడు మాల విరమణ చేసి, స్వామి వారిని దర్శించుకోనుండగా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెల మారుతీ స్వామి, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకుడు శ్రీనివాస శర్మ, ఆలయ ఏఈ లక్ష్మణ్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
చిన్న జయంతి సందర్భంగా శనివారం నుంచి 41 రోజులపాటు కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని అంజన్న ఆలయ సేవాసమితి సభ్యులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతేడాది 82 రోజలు పాటు పారాయణం నిర్వహించామని, ఈ సారి 41 రోజులపాటు నిర్వహిస్తామని చెప్పారు.
వేములవాడ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకంగా నాలుగు మినీ బస్సులను కొండగట్టుకు నడిపిస్తున్నారు. వాహనాల పార్కింగ్ స్థలం బొజ్జపోతన ఆలయం వద్ద నాలుగు పార్కింగ్ స్థలాల నుంచి కొండపైన వైజంక్షన్ దాకా ప్రయాణికులను ఉచితంగా తీసుకెళ్తున్నారు. దర్శనానంతరం తిరిగి పార్కింగ్ ప్రదేశాల వద్ద దింపుతున్నారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం ఈ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ భీంరెడ్డి తెలిపారు.
అంజన్న చిన్న జయంతి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. శుక్రవారం వేడుకల ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు వైర్లెస్ వాకీటాకీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాట్లపై కాసేపు సమీక్షించారు. నూతన పుషరిణిలో నీటిని నింపి ఉంచాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులకు సూచించారు. కొండ పైకి వచ్చే దీక్షాపరులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, దుకాణాదారులను సైతం ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. రాబోయే రోజుల్లో కొండగట్టుకు సీఎం కేసీఆర్ రాబోతున్న నేపథ్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ పాలకమండలి సభ్యులు ప్రవీణ్, సతీశ్ కుమార్, లింగం గౌడ్, రవీందర్, గంగన్న, నరసయ్య, మల్యాల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మిట్టపెల్లి సుదర్శన్ ఉన్నారు.