యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైంది. పంట చేతికందిన దశలో అకాల వర్షాలు అన్నదాతలను కలవర పెడుతుండగా, అధికార యంత్రాంగం వారికి పూర్తి భరోసా కల్పిస్తున్నది. ప్రతి గ్రామంలో సహకార సంఘాలు, ఐకేపీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోగా ఇప్పటికే 43,937 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది.
– హుజూరాబాద్, మే 8
హుజూరాబాద్, జూపాక, తుమ్మనపల్లి పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో మొత్తం 13 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 29,657 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. హుజూరాబాద్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్, రంగాపూర్, రాంపూర్, సిర్సపల్లి, పెద్దపాపయ్యపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో 12,432 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. జూపాక పీఏసీఎస్ ఆధ్వర్యంలో బొత్తలపల్లి, కనుకులగిద్ద, శాలపల్లి గ్రామాల్లో 10,400 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. తుమ్మనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో తుమ్మనపల్లి, సింగాపూర్, బోర్నపల్లి, మాందాడిపల్లిలో 6,825క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు.
డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇప్పలనర్సింగాపూర్, ధర్మరాజుపల్లి, దమ్మక్కపేట, కందుగుల, చిన్నపాపయ్యపల్లి, కాట్రపల్లిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు 12,100 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఐకేపీ ఆధ్వర్యంలో చెల్పూర్, పోతిరెడ్డిపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా 2,180 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు.
మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయి. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి, తాలు లేకుండా తీసుకురావాలి. కొనుగోళ్లు వేగవంతంగా జరిగేలా అధికారులు తగు చర్యలు చేపట్టారు. గన్నీ సంచుల కొరత లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకొన్నారు.
-వివేక్, హుజూరాబాద్ సహకార సంఘం సీఈవో