విద్యానగర్, మే 8: చేనేత హస్త కళలను ప్రోత్సహించి, కళాకారులను ఆదరించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా శ్రీరాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళా మేళాను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కళాకారులు ఉత్పత్తి చేసిన వస్తువులను నేరుగా అమ్మకాలు చేస్తున్నారని, తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
కళాకారులే నేరుగా విక్రయిస్తున్నారని, వీటిని ప్రజలు ఆదరించాలన్నారు. హస్తకళా మేళా జూన్ 1 వరకు కొనసాగుతుందని చెప్పారు. మేళా నిర్వాహకులు శనిగరం కిశోర్, జెల్ల సత్యనారాయణ మాట్లాడారు. మేళాలో పోచంపల్లి బెడ్‌షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, కళంకారి, ఖాదీ వస్ర్తాలు, మంగళగిరి చీరెలు, బ్లౌజ్ మెటీరియల్స్, వరంగల్ టవల్స్, లుంగీలు, హైదరాబాద్ ఎంబ్రాయిడరీ చీరెలు, చిన్నారుల ఫ్రాక్స్, స్కర్ట్స్, కొండపల్లి బొమ్మలు, లెదర్ బ్యాగ్‌లు, ఇమిటేషన్ జ్యుయెలరీ, కళాత్మక ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు లభిస్తాయని వారు తెలిపారు.