.. నాడు పవర్ కట్ వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేసేది. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఉండేది. ఏ చిన్న పట్టణంలో చూసినా రాత్రి, పగలు అనే తేడా లేకుండా వ్యాపార కూడళ్లలో జనరేటర్ల మోతే వినిపించేది. వాటిని వాడుకునే స్థోమత లేని వ్యాపారులు కరెంట్ ఉన్న కొన్ని గంటలే బిజినెస్ చేసుకునేది. లేని సమయంలో దుకాణాలు మూసేసి ఇండ్లకు వెళ్లేది. వ్యాపారాలు సరిగ నడువక అనేక నష్టాలను చవిచూసేది. ఇక దవాఖానల్లో పరిస్థితి అయితే దారుణంగా ఉండేది. విద్యుత్ అంతరాయానికి ఒక టైం అంటూ లేకపోవడం, శస్త్ర చికిత్సలకు కరెంట్ తప్పనిసరి కావడంతో ప్రతి ప్రైవేట్ వైద్యశాలలో 24 గంటలపాటు జనరేటర్ నడిచేది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏండ్లపాటు వ్యాపారం రంగం కుదేలైంది.
.. నేడు పరిస్థితి మారింది. పారిశ్రామిక రంగం వెలిగిపోతున్నది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అనుసరిస్తున్న విద్యుత్ ప్రణాళికతో సరఫరా వ్యవస్థ బలోపేతమైంది. చిన్నాచితకా మొదలుకొని భారీ పరిశ్రమలు, దవాఖానలకు నిరంతర విద్యుత్ అందుతున్నది. గతంలో చాలా మంది తమ వ్యాపారాలు మూసేసుకొని ఇతర పనులు చూసుకున్నారని, ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు పుణ్యమాని తమ బిజినెస్ మూడు పూలు, ఆరుకాయలుగా సాగుతోందని, బిజినెస్ నిర్వహణకు ఒక భద్రత ఏర్పడిందని ఇటు వ్యాపారులు, వైద్యులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.
కరీంనగర్, మే 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాక ముందు కరెంట్ కష్టాలు వ్యాపారులను తీవ్రంగా వేధించేవి. దుకాణాలు, దవాఖానల నిర్వహణ యజమానులకు భారంగా ఉండేది. జనరేటర్ లేనిదే నిర్వహణ సాధ్యమయ్యేది కాదు. ఇలా ఏండ్లపాటు నరకం చూసిన వ్యాపారరంగం స్వరాష్ట్రంలో తేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యుత్ ప్రణాళికతో 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ అందుతున్నది.
తెలంగాణ ఏర్పడిన కొద్ది నెలలకే గృహ, కమర్షియల్, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. క్రమంగా వ్యవసాయానికి కూడా నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నది. ఈ నేపథ్యంలో వ్యాపారాలు, దవాఖానలే కాకుండా ఇప్పుడు ప్రతి వర్గం కరెంట్ సరఫరాపై పూర్తి భరోసాతో కనిపిస్తున్నది. దేశమంతటా తీవ్రమైన విద్యుత్తు సంక్షోభం ఎదురైనా రాష్ట్రంలో మాత్రం ఒక్క క్షణం కూడా అంతరాయం లేని కరెంట్‌ను సరఫరా చేస్తున్నది. కరీంనగర్ జిల్లాలో ఒక్క కమర్షియల్ సర్వీసులే 48,787 వరకు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ దవాఖానలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. నిండు వేసవిలోనూ రెప్పపాటున అంతరాయం కలుగకుండా సరఫరా చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు అభినందిస్తున్నారు. ఎక్కడైనా రిపేర్లు వచ్చినట్లయితే షెడ్యూలు ఇచ్చి అంతరాయం కలిగిస్తున్నారు. ఈ విషయాన్ని ముందే వినియోగదారులకు తెలిసేలా ఎన్పీడీసీఎల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి వస్తోందని కమర్షియల్ వినియోగదారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన కరెంట్ అందిస్తున్న కారణంగా వ్యాపారాలు ‘పవర్’ఫుల్‌గా నడుస్తున్నాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆరు గంటలు కూడా కరెంటు ఉండేది కాదు. అరకొర వ్యాపారాలతో అరిగోస పడ్డం. తెలంగాణ వస్తే కరెంటు లేక కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎగతాళి చేసిన ఆంధ్ర పాలకుల చెంపచెళ్లుమనేలా సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తండు. ఇవ్వాళ ఆంధ్రలో కరెంట్ కోతలు నడుస్తున్నయ్. తెలంగాణ రాకపోతే మళ్లీ పాత కథే ఉంటుండె. అది ఊహించడమే కష్టంగా ఉంది. నిరంతర కరెంటుతో మా హోటల్ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన వల్లే చల్లగా బతుకుతున్నం.
– ఎండీ ఖాలిద్ హుస్సేన్, హోటల్ నిర్వాహకుడు, హుజూరాబాద్‌టౌన్.
తెలంగాణ రాక కరెంట్ కోతలు ఎడా పెడా విధించే వారు. దీంతో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య వర్గాలు కరెంట్ కోతలతో సతమతమయ్యేవి. ఆ సమయంలో ఏ చిన్న పట్టణంలో చూసినా వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో జనరేటర్ల మోతలు వినిపించేవి. వ్యాపారులకు వీటి నిర్వహణ ఎంతో భారమయ్యేది. డీజిల్, పెట్రోల్‌తో నడిచే ఈ యంత్రాలకే వ్యాపారంలో వచ్చే లాభాల్లో సగానికిపైగా ఖర్చయ్యేది. విధి లేక వీటిని నడించుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకునేవాళ్లు. కొందరు చిన్నా చితక వ్యాపారులైతే కోతల సమయంలో దుకాణాలు మూసేసుకునే వాళ్లు. కరెంట్ కోతల కారణంగా అన్ని వర్గాల వ్యాపారులు నిత్యం నష్టాల పాలయ్యేవారు.
ఉమ్మడి రాష్ట్రంల నేను చేసే వ్యాపారంల వచ్చే సంపాదన రోజు వారీ డీజిల్ ఖర్చులకే సరిపోయేది. ప్రతిరోజూ ఆరేడు గంటలకు మించి విద్యుత్ ఉండేది కాదు. బట్టల షాపులో నిరంతరం కరెంటు ఉండాల్సి రావటంతో విధిలేక జనరేటర్ వినియోగించేవాళ్లం. ఇప్పుడు నిరంతరాయంగా కరెంటు ఉంటుంది. జనరేటర్ అవసరమే లేకుండా పోయింది. ఐదేళ్ళ నుంచి ఒక్కరోజు కూడా జనరేటర్ ఉపయోగించలేదు. సీఎం కేసీఆర్ చొరవతో రెప్పపాటు కూడా పోతలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక మా జీవితాల్లో వెలుగులు వచ్చినయ్. కేసీఆర్‌కు హాట్సాప్ చెబుతున్నా.
– రమేశ్, ఆదిత్య క్లాత్ షోరూం యజమాని
సమైక్యాంధ్రలో ఉన్నపుడు కరెంట్ బాధలు చెప్పరాదు. రోజుకు ఆరేడు గంటలకంటే ఎక్కువుండేదికాదు. నాది సెలూన్ షాపు. కరెంట్ లేకపోతే పని ఎట్ల చేస్తం. ఎప్పుడస్తదా..? అని కండ్లలో వత్తులేసుకొని ఎదురుచూసేటోళ్లం. కానీ తెలంగాణ వచ్చినంక ఆ కష్టాల్లేవు. 24 గంటలు కరెంట్ ఇవ్వడమే కాదు మా మంగలి షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చి మాకు మెరుగైన ఉపాధి కల్పిస్తున్న దేవుడు కేసీఆర్. అందుకే కేసీఆర్ తెలంగాణలో చేపడుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. కేసీఆర్‌ను ప్రధాని కావాలని కోరుకుంటున్న.
– కొలిపాక రమేశ్, సెలూన్ షాపు నిర్వాహకుడు, హుజూరాబాద్‌టౌన్.
తెలంగాణ రాక మునుపు కరెంట్ బాధలు చెప్పరాదు. కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎపుడు పోతదో తెల్వదు. పని లేక అరిగోస పడ్డం. దుకాణాలు మూసే పెట్టెటోళ్లం. పని లేక.. కుటుంబాలను పోషించలేక నరకం చూసినం. అప్పటి బాధలు యాదికస్తేనే ఏడుపస్తది. కానీ మన తెలంగాణ మనకు వచ్చి, ఎప్పుడైతే కేసీఆర్ సీఎం అయ్యిండో మా బాధలు తీరినయి. 24 గంటలపాటు అంతరాయం లేకుండా కరెంట్ ఇస్తున్నడు. అప్పటి నుంచి మా వ్యాపారం బాగుపడ్డది. ఏ రంది లేకుండా బతుకుతున్నం. నవ్విన నాపచేనే పండిందన్నట్లు తెలంగాణ ఏర్పడితే కరెంటు లేక ఇబ్బందులు పడతారని అప్పుడు హేళన చేసినోళ్లే ఇప్పుడు బాధలు పడుతున్నరు. ఆంధ్రలోనే కరెంట్ లేక గోస పడుతున్నరు.
– దాసరి మల్లేశ్, వైండింగ్ కార్మికుడు, హుజూరాబాద్‌టౌన్.
కరెంట్ కోతల కారణంగా ప్రైవేట్ దవాఖానలైతే కుదేలయ్యేవి. రోగులకు ఇబ్బందులు కలుగడంతో ప్రతి దవాఖానకు జనరేటర్ తప్పనిసరిగా ఉండేది. విద్యుత్ కోతలు ఎప్పుడు విధించేది తెలియక పోవడంతో ప్రైవేట్ దవాఖానాల్లో శస్త్ర చికిత్సలు చేయాలంటేనే వైద్యులు జంకి పోయేవారు. అప్పట్లో కరెంట్ కంటే ఎక్కువ జనరేటర్లను నమ్ముకునే వైద్యులు శస్త్రచిత్సలు చేసేవారు. దీంతో దవాఖానల నిర్వహణ పెనుభారంగా మారేది. అంతిమంగా వైద్యులు కూడా రోగులపైనే అడ్డగోలుగా బిల్లులు వేసే పరిస్థితి అప్పట్లో కనిపించేది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యంతోనే మా వ్యాపారాలు సజావుగా సాగుతున్నయ్. ఉమ్మడి రాష్ట్రంల ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడచ్చేదో తెలువదు. ఎప్పుడు పొయేదో తెలువదు. నిరంతరం జనరేటర్తోనే మా వ్యాపారాలు సాగేవి. రోజుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు డీజిల్‌కు ఖర్చయ్యేది. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆరేడేండ్ల నుంచి ఈ సమస్యలు తప్పినయ్. 24 గంటలు కరెంటు ఉంటోంది. ఏ ఇబ్బందుల్లేకుండా వ్యాపారం నడుస్తోంది. అప్పుడు కొన్న జనరేటర్ మూలకు చేరింది. దాని అవసరమే రావడమే లేదు.
– ఆకుల శ్రీనివాస్, సాఫ్టీ పాయింట్ ఐస్‌క్రీం పార్లర్ యజమాని జనరేటర్ మూలకు చేరింది