మత్స్యకారులకు చేతినిండా పనికల్పించేందుకు అనేక పథకాలతో అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కారు, మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చెరువులు, కుంటలను ఆధునీకరిస్తూ, ఉచితంగా చేప విత్తనాలు పంపిణీ చేస్తూనే, ప్రతి మత్స్యకారుడికి ఫిషరీస్ సొసైటీల్లో మెంబర్ షిప్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సభ్యత్వాలతోపాటు చెరువులు ఉండి సంఘాలు లేని గ్రామాల్లో కొత్తగా సొసైటీల ఏర్పాటుకు చాన్స్ ఇవ్వగా, రంగంలోకి దిగిన మత్స్యశాఖ ఈ నెల 4వ తేదీ నుంచి సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దరఖాస్తులకు ఈ నెల 20వ తేదీయే ఆఖరుకాగా, సంఘ సభ్యత్వంతో సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎంతో లబ్ధి కలుగనున్నది.
కరీంనగర్ రూరల్, మే 8 : చితికిపోయిన కులవృత్తులకు జీవం పోస్తున్న రాష్ట్ర సర్కారు, అనేక పథకాలతో అండగా నిలుస్తున్నది. ఒకప్పుడు చెరువుల్లో చేపల్లేక.. మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులోకి రాక ఎన్నో ఇబ్బందులు పడ్డ మత్స్యకారులకు స్వరాష్ట్రంలో ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో చేతినిండా పనికల్పిస్తున్నది. మత్స్య సమీకృత అభివృద్ధి (ఐఎఫ్డీఎస్) చెరువుల్లో ఉచితంగా చేప విత్తనాలు పోస్తున్నది. మత్స్యకారులకు రాయితీపై వలలు, ఊరూరా తిరిగి చేపలు అమ్ముకునేందుకు ట్రక్కులు, మొబైల్ అవుట్లెట్లు, లగేజీ ఆటోలు, మోపెడ్లు, భారీగా ఫిష్ క్రేట్సు అందిస్తున్నది. ఇంకా పలు రకాల ప్రయోజనాలతోపాటు చెరువులపై పూర్తి హక్కు కల్పించేందుకు మత్స్యసహకార, పారిశ్రామిక సంఘాలను ఇదివరకే ఏర్పాటు చేసింది. మత్స్యసంపదను ఇంకా అభివృద్ధి చేయాలంటే ప్రతి మత్స్యకారుడిని సంఘాల్లో సభ్యుడిగా చేర్చాలని, సంఘాలు లేని గ్రామాల్లోనూ కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించి,ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది
మత్స్యరంగంలో ఉన్న 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మత్స్యపారిశ్రామిక సహకార, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్యత్వం కల్పించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ అదేశాల మేరకు ఈ నెల 4వ తేదీనే రంగంలోకి దిగి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. అర్హులైనవారందరినీ సంఘాల్లో సభ్యుడిగా నమోదు చేస్తామని, దరఖాస్తులకు ఈ నెల 20వ తేదీయే ఆఖరు అని కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ అధికారి జీ రాజనర్సయ్య తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 175 మత్స్య సహకార సంఘాలు, ఆరు మహిళా మత్స పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. ఇంకా అర్హత ఉండి సభ్యుడిగా చేరని వారు, చెరువులు ఉండి సంఘాలు లేని గ్రామాల్లో సొసైటీల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. చెరువుల్లేని గ్రామాల్లో మత్స్యకార మార్కెటింగ్ సహకార సంఘాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 8 గ్రామాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు. చొప్పదండి మండలం కోనేరుపల్లి, వీణవంక మండలంలోని అముదాలపల్లి, హుజూరాబాద్ మండలం కొత్తపల్లి, గంగాధర మండలం చిన్నఆచంపల్లి, కాసిరెడ్డిపల్లి, శంకరపట్నం మండలంలోని గరీభ్పేట, తదితర గ్రామాల నుంచి అర్జీలు పెట్టుకోగా, ఈ నెల 20 వరకు దరఖాస్తులకు ఆఖరు అని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని ఏ సహకార సంఘంలో నూతన సభ్యత్వం తీసుకోవాలంటే ఆ సంఘం తీర్మానం కాపీ ఉండాలి. ఇంకా చెరువుల నీటి విస్తీర్ణం ధ్రువీకరణ పత్రం కావాలి. చేరబోయే వ్యక్తి తన ఆధార్, బ్యాంకు అకౌంట్ వివరాలతో పైవాటిని జత చేసి జిల్లా మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలి.