గంగాధర, ఏప్రిల్ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో మండలంలో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. సర్కారు తీసుకుంటున్న చర్యలతో గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో వరి సాగు చేశారు. పంట చేతికి రావడంతో మండలంలో వరి కోతలు జోరందుకున్నాయి. ఏ గ్రామంలో చూసినా రైతులు హార్వెస్టర్లతో వరి కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో మండలంలో పంటల సాగు విస్తీర్ణం ఏడాదికి ఏడాది పెరుగుతూ వస్తున్నది. 2016-17 వానకాలంలో 8478 ఎకరాల్లో, 2017 యాసంగిలో 6918 ఎకరాల్లో, వానకాలంలో 20,507 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 2018 యాసంగిలో 5741 ఎకరాల్లో , వానకాలంలో 18,507 ఎకరాల్లో, 2019 యాసంగిలో 7438 ఎకరాల్లో, వానకాలంలో 19,833 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 2020 యాసంగిలో 16,135 ఎకరాల్లో, వానకాలంలో 28,872 ఎకరాల్లో, 2021 యాసంగిలో 25,500 ఎకరాల్లో, వానకాలంలో 25,741 ఎకరాల్లో పంటలను రైతులు సాగు చేశారు. కాగా, ఈ యాసంగిలో 17,741 ఎకరాల్లో పంటలు సాగు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాలతో ఏడాదికేడాది ధాన్యం దిగుబడి పెరుగుతూ వస్తున్నది. గంగాధర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 2019-20 వానకాలంలో లక్షా 96 వేల 275 క్వింటాళ్లు, 2019-20 యాసంగిలో 51 వేల 832 క్వింటాళ్లు, 2020-21 వానకాలంలో 69,312 క్వింటాళ్లు, యాసంగిలో 1,48,883 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. కురిక్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 2019-20 వానకాలంలో 46 వేల క్వింటాళ్లు, 2019-20 యాసంగిలో 68 వేల 206 క్వింటాళ్లు, 2020-21 వానకాలంలో 39 వేల క్వింటాళ్లు, యాసంగిలో 88,393 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో 2019-20 వానకాలం సీజన్లో లక్షా 66 వేల 336 క్వింటాళ్లు, 2019-20 యాసంగిలో లక్షా 96 వేల 275 క్వింటాళ్లు, 2020-21 వానకాలంలో లక్షా 75 వేల క్వింటాళ్లు, యాసంగిలో 1,32,769 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. గత వానకాలంలో 2,07,320 క్వింటాళ్లు రాగా, ఈ యాసంగిలో ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం వర్షం కోసం ఎదురుచూడకుండా పొలం సాగు చేస్తున్నం. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలను నింపుతున్నది. వేసవిలో కూడా మా ఊరి చెరువు నీటితో నిండుగా ఉన్నది. చెరువులు, బావుల్లో నీళ్లు నిండడంతో మొత్తం భూమి సాగు చేయగా అధిక దిగుబడి వచ్చింది. -వేముల భాస్కర్, మధురానగర్భూగర్భ జలాలు పెరిగినయ్ రాష్ట్ర ప్రభుత్వం వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో జీవనదిలా మారింది. భూగర్భ జలాలు పెరుగడంతో బీడు భూములు సాగులోకి వచ్చినయ్. ఉమ్మడి రాష్ట్రంలో బావిలో నీళ్లు లేక కొంత సాగు చేసి, మిగతాది బీడుగా వదిలేసేటోళ్లం. వరద కాలువలో నీళ్లు నిండుగా ఉండడంతో మొత్తం పొలం సాగు చేసిన.
జోరందుకున్న వరి కోతలు
మా గ్రామ పరిధిలోని రెండు కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. గ్రామంలో వరి కోతలు ఊపందుకున్నయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబోస్తున్నరు. కేంద్రాల్లో నిర్వాహకులు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించిన్రు. ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-వేముల దామోదర్, కాసారం