‘లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి..’ఇది స్వామి వివేకానంద చెప్పిన మాట! లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తే.. విజయం మీ సొంతమవుతుంది! ఎన్నాళ్లుగానో ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్న సర్కారీ కొలువుల మేళా మొదలైంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 16,614 పోలీస్, 503 గ్రూప్-1, 677 ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ శాఖల్లో పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు రాగా, అభ్యర్థులు కష్టపడితే కొలువు సులువు కానున్నది. కొత్త జోనల్ వ్యవస్థతో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువతకు ఉద్యోగాలు సాధించేందుకు ఎక్కువ అవకాశమున్నది. ఒత్తిడి, భయం, అపోహలు వీడి పక్కా ప్లానింగ్ ప్రకారం ప్రిపేరైతే కల సాకారమవుతుంది.
గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 18 శాఖలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్నట్టు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. అందులో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు-91, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-48, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 పోస్టులు-41, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40, ఎంపీడీవో పోస్టులు-121తో పాటు మరికొన్ని పోస్టులు ఉన్నాయి.
ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనేందుకు గతంలో గరిష్ఠ వయోపరిమితి 25 ఏండ్లు ఉండగా, ఇప్పుడు 28 ఏండ్ల వరకు కూడా జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితిని సైతం 22 ఏండ్ల నుంచి 25 ఏండ్లకు పెంచారు.
కరీంనగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కమాన్ చౌరస్తా: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల పైచిలుకు ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆయా ప్రభుత్వ శాఖల్లో కొలువుల భర్తీకి కసరత్తు మొదలు పెట్టగా, రాష్ట్ర సర్కారు భారీ ఉద్యోగ మేళాను ప్రారంభించింది. ఈ నెల 25న పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో 16,614 పోస్టులు.. 26వ తేదీన మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
గురువారం మరో 677 ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పరంపర ఇంకా కొనసాగనుండగా, మున్ముందు వేలాది పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనున్నది. తెలంగాణ సర్కారు దేశ చరిత్రలోనే అతి పెద్ద నోటిఫికేషన్లను విడుదల చేసిందని, యువతకు ఇది సువర్ణావకాశమని నిపుణులు చెబుతున్నారు. సీఎం ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం నియామకాలు చేపట్టనుండగా, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయంటున్నారు. అయితే, ఈ కొలువుల కల సాకారం కావాలంటే ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. అనుకున్న లక్ష్యం కోసం ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయం మీ దరిచేరుతుందని భరోసా ఇస్తున్నారు. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదని, విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా లబ్ధి కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు జోన్ల పరిధిలోని ఇతర జిల్లాలతో పోలిస్తే విద్యారంగంలో ఎంతో పురోగతి సాధించిన మన జిల్లా బిడ్డలకే అవకాశాలు ఎక్కువగా రానున్నాయి. ఉద్యోగాల భర్తీ మొదలైతే స్థానికంగా ఎక్కువ కొలువులు సాధించే అవకాశాలున్నాయి. ఇక నుంచి మన ఉద్యోగాలు మనకే దక్కుతాయి. జిల్లా, జోనల్, మల్టీ జోన్ పరిధిలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి.
పోలీసు ఉద్యోగాల భర్తీకి వచ్చే నెల2వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోలీస్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు పోస్టుల దరఖాస్తుకు 20వ తేదీ వరకు గడువిచ్చారు. ఇతర సమాచారం కోసం వెబ్సైట్లో చూడాలని అధికారులు తెలిపారు. అలాగే గ్రూప్-1 పోస్టులకు సంబంధించి మే 2వ తేదీ నుంచి 31వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షల విధానం, సిలబల్ తదితర సమాచారం కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో చూడవచ్చని అధికారులు చెబుతున్నారు.
మాది హుజూరాబాద్. నాన్న ఓడేడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అమ్మ శోభ గృహిణి. నేను హుజూరాబాద్ పట్టణంలోని నాగార్జున పాఠశాలలో ఎస్సెస్సీ, ఇంటర్ విజయ తేజస్విని, డిగ్రీ జాగృతి కాలేజీలో చదివా. 2018 సంవత్సరంలో పీజీ కేయూలో రాగా వ్యక్తిగత కారణాలతో చేరలేదు. సంవత్సరం ఇంటి వద్దే ఉండి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా. 2018లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా రోజుకు నాలుగంటల పాటు చదువుకొని పోటీ పరీక్ష రాశా. విజయాన్ని సాధించి మంచి ర్యాంక్ పొందా. ఉద్యోగానికి ఎంపికైన తర్వాతే జాగృతి కళాశాలలో పీజీ పూర్తి చేశా. పంచాయతీ కార్యదర్శిగా 2020 జూలై 9న మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామంలో విధుల్లో చేరా. ప్రస్తుతం జమ్మికుంట మండలం మాచనపల్లిలో పనిచేస్తున్న. మా అక్క సుమంజలితో కలిసి ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఇండియన్ హిస్టరీ, జనరల్ నాలెడ్జ్, జాగ్రఫీ వంటి పుస్తకాలను చదువుతూ గ్రూప్స్ సాధించాలన్న నా కల నెరవేర్చుకున్న దిశగా ముందుకు సాగుతున్నా. పట్టుదలతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న.
– గబ్బెట శివరంజని, పంచాయతీ కార్యదర్శి (జమ్మికుంట రూరల్)
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సర్కారు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నది. ఇది నిరుద్యోగులకు వరంలాంటింది. ఇలాంటి సమయంలో అనవసర భయాలు పెంచుకోవద్దు. ఒత్తిడికి లోనుకావద్దు. భయం, ఆత్రుత అనేవి మొదలైతే అది వారి అవకాశాలను దెబ్బతీస్తుంది. వీటిని జయించాలంటే అభ్యర్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా ఒక టైం షెడ్యూల్ తయారు చేసుకోవాలి. దాని ప్రకారం చదవాలి. దాంతోపాటే అప్పడప్పుడు రిలాక్స్ కావాలి.
మంచి పోషకాహారం తీసుకోవాలి. రోజుకు 6 నుంచి 8గంటల నిద్ర ఉండాలి. కొద్దో గొప్పో శారీరక శ్రమ ఉండాలి. అప్పుడే ఒత్తిడి దూరమవుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది సాధ్యమవువతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అలాగే గంటలకు గంటలు చదవకుండా మధ్యమధ్యలో బ్రేక్ తీసుకోవాలి. వీలైతే 30 నిమిషాలకోసారి రెండు నిమిషాల విరామం ఉంటే బాగుంటుంది. దాని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
గ్రూప్స్ కోసం నేను కొన్నేళ్లుగా ప్రిపేరవుతున్న. సరైన ప్రణాళికతో ముందుకు సాగాలాంటే నేర్చుకున్నదాని కంటే నిపుణుల సూచనలు అవసరం. ఇందుకోసం ఎవరైనా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారా? అని ఎదురు చూస్తున్న క్రమంలో ఈ సదస్సు నిర్వహించడం మంచి అవకాశం. నాతో పాటు చాలా మందికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారు కచ్చితంగా దీనిని సద్వినియోగం చేసుకుంటే మంచిది.
– అనభేరి ప్రణయ్‌రావు, గ్రూప్స్ అభ్యర్థి (కరీంనగర్)
శిక్షణ, సరైన విధానంలో ప్రిపేర్ అవుతేనే గ్రూప్స్ సాధించడం సాధ్యమవుతుంది. సరైన విధానంలో చదవడానికి ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ప్రముఖులతో కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది జిల్లా వాసులకు చాలా ఉపయోగపడుతుంది. దీనిని సద్వినియోగం చేసుకుంటాం. నిపుణుల సలహాలు, సూచనలు మాలాంటి యువతకు స్ఫూర్తినిస్తాయి.
– జీడిపెల్లి లింగారావు, గ్రూప్స్ అభ్యర్థి (కరీంనగర్ )
పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకోలేని, ఆర్థిక స్థోమత లేని వారి కోసం నిపుణలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుండడం శుభపరిణామం. ఈ కార్యక్రమం ఉంటుందని తెలియగానే సంతోషం వేసింది. ప్రిపరేషన్ ప్లాన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, ఎలాంటి భయం లేకుండా చదువుకోవచ్చనే నమ్మకం వచ్చింది. ఆయా రంగాల్లో ఉన్నతస్థానంలో ఉన్న వారి స్పీచ్‌లు వింటే మరింత ఉత్సాహంగా సిద్ధం కావచ్చు.
– రాధాకృష్ణవేణి, గ్రూప్స్ అభ్యర్థి (కరీంనగర్ )
మాది మంథని. అమ్మానాన్న కూలీలు. మా కోసం చాలా కష్టపడ్డరు. వారి కన్నీళ్లను చూసి పెరిగిన. ఎలాగైనా సరే కొలువు కొట్టాలనుకున్న. ప్రభుత్వం గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో సంతోషపడ్డ. మొదట కొంత భయం అనిపించింది. కానీ, ఒక ప్రణాళికతో ముందుకెళ్లిన. కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన. రిజల్ట్ ఆలస్యమైంది. ఈ లోగా పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ రాసిన. జేపీఎస్‌గా ఎంపికైన. ఈ జాబ్ చేస్తుండగానే గ్రూప్-2 రిజల్ట్ వచ్చింది.
ఏఎస్‌వోగా జాబ్ వచ్చింది. నాలాగే కష్టపడిన ఎంతో మంది పేద పిల్లలకు జాబ్స్ వచ్చినయ్. ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో టీఎస్పీఎస్సీ ఎంతో పారదర్శకంగా వ్యవహరించడంతోనే ఇది సాధ్యమైంది. గ్రూప్-1 అధికారి కావాలన్నదే నా లక్ష్యం. అందుకోసం మళ్లీ కష్టపడుత. మొన్ననే సర్కారు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలాగైనా గ్రూప్-1 కొడుత.
– మీసాల రాజు, ఏఎస్వో