కొత్తపల్లి, ఏప్రిల్ 13: కేంద్రం యాసంగిలో వరిధాన్యాన్ని కొనబోమని కరాఖండిగా చెప్పడం రైతులను ఆందోళనకు గురి చేసిందని, వారిని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతిగింజా కొనాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని నగర మేయర్ వై సునీల్‌రావు పేర్కొన్నారు. యాసంగిలో పండిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరసనలు చేసినా కేంద్రం స్పందించలేదని ధ్వజమెత్తారు. బుధవారం టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి నగరంలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధిలో అన్ని రాష్ర్టాలతో పోటీపడుతున్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతూ విషం చిమ్ముతున్నదని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని గుర్తు చేశారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు గ్రామ గ్రామాన ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం యాసంగి వడ్లను కొనుగోలు చేయకుండా కుంటి సాకులు చెబుతూ నాలుగు మాసాలుగా రైతులను ఇబ్బందులు పెడుతున్నదన్నారు. త్వరలోనే రైతులు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు.
మత విద్వేషాలు, రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్న బీజేపీ నాయకులు ఎప్పుడైనా కేంద్రాన్ని వడ్లుకొనమని అడిగారా? అని ప్రశ్నించారు. యాసంగిలో కేంద్రం వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదని, రైతులను ఇతర పంటలు వేసుకోవాలని సీఎం కేసీఆర్ చెబితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నదాతలను రెచ్చగొట్టి పంటలు వేయించారని మండిపడ్డారు. ఇప్పుడు ఆయనే రాష్ట్రంపై విమర్శలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా, రైతుల సంక్షేమంపై దృష్టిసారిస్తే బీజేపీ మాత్రం ఓట్ల కోసం ఆరాటపడుతున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలను రైతులు ముందుండి నడిపించడం అభినందనీయమన్నారు.
కేంద్రం వివక్ష చూపుతున్నప్పటికీ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం నిర్ణయానికి మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 90వేలకు పైగా ఉద్యోగ నియామకాలు జరుగనున్నాయని తెలిపారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే దేశంలో లక్షలాదిగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ అయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వడ్లకొనుగోళ్లకు సహకరించిన మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు రైతుల పక్షాన మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు ఏవీ రమణ, బండారి వేణు, బుచ్చిరెడ్డి, ఐలేందర్‌యాదవ్, గంట కల్యాణి, కే భూమాగౌడ్, గందె మాధవి, నాయకులు కోల సంపత్, గందె మహేశ్, సుధగోని మాధవీకృష్ణాగౌడ్, అనిల్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.