హనుమాన్ చిన్న జయంత్యుత్సవాలకు కొండగట్టు అంజన్న క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ఐదు రోజుల పాటు సాగే వేడుకలకు ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచీ తరలివచ్చే లక్షలాది మంది దీక్షాపరులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా చూస్తున్నది. మొత్తంగా 500 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తుండగా, నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షించనున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే స్వామివారికి రెండు జయంతుల నిర్వహణ ఆనవాయితీగా వస్తుండగా, భక్తుల రద్దీ దృష్ట్యా అభిషేకాలు, అర్చనలు మాత్రమే కొనసాగనున్నాయి.
మల్యాల, ఏప్రిల్ 13 : ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి ఈ నెల 18 వరకు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 16న చిన్న హనుమన్ జయంతి కాగా, ఐదు రోజులపాటు వేడుకలు సాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రతోపాటు రాష్ట్ర నలు మూలల నుంచి లక్షలాది మంది భక్తులు, దీక్షాపరులు తరలిరానుంగా, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఎండకాలం కావడంతో ప్రధానాలయం ఆవరణతోపాటు గుట్టపై ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేశారు. టికెట్ కౌంటర్లు, స్వామి వారి దర్శనానికి క్యూ లైన్లు, బారికేడ్లను నిర్మించారు. మాల విరమణ మండపం ఎదుట భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆరు సెల్లార్లు నిర్మించారు. వీఐపీల దర్శనం కోసం ఆలయ వెనక ద్వారం నుంచి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు.
ఇంకా పది జనరేటర్లను సిద్ధంగా ఉంచారు. వై జంక్షన్ నుంచి నాచుపెల్లి మార్గంలోని బొజ్జపోతన్న వరకు శాశ్వతంగా ఎల్ఈడీ లైట్లను, 8 లక్షలు వెచ్చించి ఆలయం చుట్టూ అద్దె ప్రాతిపాదికన సోలార్ లైట్లను అమర్చారు. 30 ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సారి ప్రత్యేకంగా శుద్ధి చేసిన జలాలతో ఐదు మొబైల్ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. గుట్ట మీద ఉన్న ఐదు సులభ్ కాంప్లెక్స్లతోపాటు 75 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. నూతన పుష్కరిణి వద్ద మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులను నిర్మించారు. ఘాట్ రోడ్డుతోపాటు నాచుపెల్లి దారులపై ట్యాంకర్లు ఉంచి జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా పారిశుధ్య నిర్వహణకు జగిత్యాల డీపీవో అదనపు సిబ్బందిని సమకూర్చారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా కొండగట్టు ఆంజనేయ స్వామికి రెండు జయంతులు నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ చిన్న జయంతిని, వైశాఖ బహుళ దశమి రోజున హన్మాన్ పెద్ద జయంతిని నిర్వహిస్తారు. చిన్న జయంతి రోజున కొండగట్టులో ఆలయంలో ఎలాంటి ప్రత్యేక ఉత్సవాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించకుండా కేవలం అభిషేకం, అర్చనలు మాత్రమే నిర్వహిస్తారు. శ్రీ చాత్తాద శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం జయంతి ఉత్సవాలను జరుపుతారు.
స్వామి వారి తిరునక్షత్రం రోజైన వైశాఖ బహుళ దశమిని ప్రధాన ఉత్సవంగా పేర్కొంటూ ఆలయంలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞం నిర్వహించి, జయంతి రోజున పూర్ణాహుతితో ఉత్సవాలను ముగిస్తారు. హనుమాన్ చిన్న జయంతి తర్వాత సరిగ్గా మండల(41)రోజుల తర్వాత పెద్ద జయంతిని నిర్వహిస్తారు. అత్యంత కఠిన నియమాలతో స్వీకరించి, ఆచరించిన మండల, అర్ధమండల దీక్షలు, ఏకాదశ దీక్షలు, 5 రోజుల దీక్షలను చిన్న జయంతి రోజున స్వామి సన్నిధిలో విరమణ చేసి మొక్కులు చెల్లించుకుని తిరిగి వెళ్లారు.
లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు నిఘానేత్రం ఉంచారు. దేవాలయం తరపున ఆలయంలోపల, ఆలయానికి వెలుపల అమర్చిన 23 సీసీ కెమెరాలకు అదనంగా 50 సీసీ కెమెరాలను అమర్చారు. పోలీస్ ఔట్ పోస్టులో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. ఆలయంతోపాటు పోలీస్ ఔట్ పోస్టు వద్ద డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)లను ఏర్పాటు చేశారు.
భక్తులకు ప్రీతిపాత్రమైన స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు. ఉత్సవాలకు వచ్చే దీక్షాపరులు, భక్తుల కోసం ఆలయ అధికారులు ముందుస్తుగానే మూడు లక్ష ల లడ్డూలను తయారు చేశారు. ఇవి సరిపోని పక్షంలో మరిన్ని తయారు చేసేందుకు అదనపు సిబ్బందిని సైతం సిద్ధంగా ఉంచినట్లు ప్రసాద తయారీ ఇన్చార్జి సునీల్, ధర్మేందర్ తెలిపారు. భక్తులు వచ్చే సంఖ్యకు అనుగుణంగా అప్పటికప్పుడే పులిహోరను తయారుచేసి భక్తులకు అందిస్తామని వారు తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా జగిత్యాల ఎస్పీ సింధూశర్మ 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. జగిత్యాల డీఎస్పీతో పాటు అదనంగా మరో ఇద్దరు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 300 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లు, 125 హోంగార్డులు కొండగట్టులో బందోబస్తు నిర్వహించనున్నారు.