వేములవాడ, ఏప్రిల్16: పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ రాజన్నకు వార్షిక ఆదాయం 87.78కోట్లు సమకూరింది. కరోనా నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు నెలలు భక్తులకు దర్శనాలు నిలిపివేసినా ఆదాయం గణనీయంగానే సమకూరింది. రెండేళ్లకోసారి జరిగే సమక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో వనదేవతలను దర్శించుకేనే ముందు భక్తులు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక 2019-20 సంవత్సరంలో జరిగిన సమక్క-సారలమ్మ జాతర సందర్భంగా ఆ ఏడా ది స్వామివారికి రూ.85కోట్ల ఆదా యం వచ్చింది. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ సమక్క జాతర జరుగగా రాజన్న ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చా రు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో స్వా మి వారికి రూ.87.78కోట్ల నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా హుండీ కానుకల ద్వారా రూ.28.34 కోట్లు, కోడె మొక్కుల ద్వారా రూ.18.28 కోట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.13. 86కోట్లు, అర్జిత సేవల ద్వారా రూ.6.83 కోట్లు, లీజులు, అద్దెల ద్వారా రూ.5.35 కోట్లు, శీఘ్ర దర్శనాల ద్వారా రూ.2.17 కోట్లు, స్వామివారికి అద్దె గదుల ద్వారా రూ.2.71 కోట్లు, ఇతరత్రా రూ.10.24 కో ట్ల నగదు ఆదాయం ఈ వార్షిక సంవత్సరంలో సమకూరినట్లు వారు తెలిపారు. గత సమ్మక్క జాతర కంటే ఈసారి రూ.2.78 కోట్ల ఆదాయం ఎక్కువగా రాజన్న ఆలయానికి సమకూరింది.