రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని ఎస్సీ బాల, బాలికల వసతి గృహాలు అధునాతన హంగులు అద్దుకున్నాయి. మంత్రి కేటీఆర్ చొరవతో సరికొత్తగా దర్శనమిస్తున్నాయి. సకల సౌకర్యాలతో గ్రంథాలయాలు, స్టడీరూంలు అందుబాటులోకి వచ్చాయి. విశాలమైన కిచెన్, డైనింగ్ హాల్లు రూపుదిద్దుకున్నాయి. విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా హాస్టల్ ఆవరణలో ఓపెన్ జిమ్‌లు కొలువుదీరాయి. వారిని ఆటల్లో రాణించేలా తీర్చిదిద్దే సంకల్పంతో అన్ని హంగులతో ఫుట్‌బాల్, షటిల్ కోర్టులు నిర్మితమయ్యాయి.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 16 : సిరిసిల్లలోని గీతానగర్లోగల ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ 1974లో ప్రారంభంకాగా, సుందరయ్యనగర్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్ 35 ఏండ్ల క్రితం అందుబాటులోకి వచ్చింది. అయితే గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ హాస్టళ్లు సమస్యల వలయంలో కొట్టుమిట్డాడేవి. వసతుల కల్పనకు నిధుల్లేక అరొకొర సౌకర్యాల మధ్యే కొనసాగేవి. విద్యార్థులు సైతం వీటిలో చేరేందుకు నిరాసక్తత కనబరిచేవారు.
అయితే ఇందుకు భిన్నంగా తెలంగాణ సర్కారు విద్యారంగానికి ప్రాధాన్యత నిస్తున్నది. బడుగు, బలహీన వర్గాలు ఉండే హాస్టళ్ల ఆధునీకరణకు నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సిరిసిల్లలోని ఎస్సీ బాల, బాలికల వసతిగృహాలను ఆధునీకరించాలని నిర్ణయించారు. ఇందుకు ఎస్డీఎఫ్, సీడబ్ల్యూఎఫ్, ఈడబ్ల్యూఐడీసీ కింద 68 లక్షలు మంజూరు చేశారు. హాస్టళ్ల ఆధునీకరణకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు ఈ దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
గత జనవరిలో పనులు ప్రారంభించారు. ప్రభుత్వ బాలికల వసతి గృహంలో 10 లక్షలతో డైనింగ్ హాల్, మరో 10 లక్షలతో కిచెన్ నిర్మించారు. 6లక్షలతో వాల్‌పెయింటింగ్స్, మోడ్రన్ టాయిలెట్స్ అందుబాటులోకి తెచ్చారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 5 లక్షలతో ఉద్యానవనం, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. బాలుర హాస్టల్లో 20లక్షలతో లైబ్రరీ, డార్మిటరీ హాల్, కిచెన్‌ను నిర్మించారు. 6లక్షతో పెయింటింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్, వాటర్ సప్లయ్ తదితర పనులు పూర్తి చేశారు. 6లక్షలతో ఓపెన్ జిమ్, వాలీబాల్, ఫుట్‌బాల్ కోర్టులను అందుబాటులోకి తెచ్చారు. వీటి పరిసరాల్లో గార్డెన్‌ను సుందరీకరించారు. విద్యార్థులు తమ పుస్తకాలు, బ్యాగులు భద్రపరుచుకొనేందుకు వీలుగా కప్‌బోర్డులను ఏర్పాటు చేశారు. భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాచ్‌మెన్‌ను నియమించారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎస్సీ బాల, బాలికల హాస్టళ్ల ఆధునీకరణకు చర్యలు చేపట్టాం. కలెక్టర్ సూచనల మేరకు పనులు కొనసాగించాం. ఆయా శాఖలను సమన్వయం చేసుకుని అవసరమైన నిధులు సమీకరించి 68లక్షలతో వసతి గృహాలను సకల వసతులతో తీర్చిదిద్దాం. కేవలం మూడు నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చాం.
– భాస్కర్‌రెడ్డి, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి (సిరిసిల్ల)
మంత్రి కేటీఆర్ చొరవతో ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రైవేటుకు దీటైన వసతులు సమకూరాయి. మా హాస్టల్లో 47మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 13మంది బీసీ, 5గురు ఎస్టీ, 29మంది ఎస్సీ విద్యార్థులు ఉన్నారు. మొన్నటి వరకు వీరికి అరకొర వసతులే ఉండేవి. ప్రస్తుతం అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. రీడింగ్ రూంలు, రెస్ట్ రూంలు, లైబ్రరీ, మోడ్రన్ టాయిలెట్స్ ఏర్పాటుపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– ప్రవీణ్, వార్డెన్, ప్రభుత్వ బాలుర వసతి గృహం(సుందరయ్యనగర్)
మొదటగా కేటీఆర్ సార్‌కు థ్యాంక్స్ చెప్పాలి. నేను రెండేండ్లుగా ఈ హాస్టల్ ఉండి చదువుకుంటున్న. చాలా బాగా డెవలప్ చేశారు. గోడలకు రంగులు వేశారు. చదువుకునేందుకు లైబ్రరీ, రీడింగ్ రూం ఏర్పాటుచేశారు. స్నానానికి వేడి నీళ్ల కోసం గ్రీజర్, ఓపెన్ జిమ్, వాలీబాల్ కోర్టు ఏర్పాటుచేసిండ్రు. కేటీఆర్ సార్ మా హాస్టల్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పిన. సార్ చెప్పినట్లు అల్లరి చేయకుండా మంచిగ సదువుకుంట.
– భూక్య మహేశ్, 7వ తరగతి (మానాల)
నేను రెండో తరగతి నుంచి ఈ హాస్టల్లో ఉంటున్న. ఈ పక్కనే మా స్కూల్. రెండేండ్లలో మా స్కూల్‌ను ఎంతో బాగా చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించారు. మంచి భోజనంతో పాటు ప్రైవేటు హాస్టల్లో కూడా లేని వసతులు కల్పించడం సంతోషంగా ఉంది. పనులు చేయించిన కేటీఆర్ సార్‌కు థ్యాంక్స్ చెబుతున్న. బాగా చదివి సార్‌కు మంచి పేరు తెస్తా.
– జగదీష్, 8వ తరగతి (మానాల)