‘రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్ కీ’ఇలా ఆద్యంతం అంజన్న నామస్మరణతో ఉమ్మడి జిల్లాలోని అంజన్న ఆలయాలు మార్మోగాయి. శనివారం హనుమాన్ చిన్న జయంతి వేడుకలు అంతటా వైభవంగా సాగాయి. ప్రధానంగా కొండగట్టు క్షేత్రం భక్తజనసంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన దీక్షాపరులతో పోటెత్తింది. మొత్తంగా లక్ష మందికిపైగా తరలిరాగా, ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపించింది. ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు గుట్ట కింద ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారింది. సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణంతో భక్తిభావం వెల్లివిరిసింది. హనుమాన్ కీకొండగట్టు కిక్కిరిసింది. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా తెలంగాణతో పాటు వివిధ రాష్ర్టాల నుంచి స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కొండంతా కాషాయశోభితమైంది. దాదాపు లక్ష మందికిపైగా తరలిరాగా, క్షేత్రమంతా ‘రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ’ నామ స్మరణతో మార్మోగింది.
మల్యాల, ఏప్రిల్ 16: హనుమాన్ చిన్న జయంత్యుత్సవాలు కొండగట్టులో వైభవంగా సాగుతున్నాయి. గురువారం మొదలైన ఈ వేడుకలు, సోమవారం ముగియనున్నాయి. శనివారం చిన్న జయంతి కాగా, శుక్రవారం సాయంత్రం నుంచే వేలాది మంది దీక్షాపరులు గుట్టపైకి తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 5 గంటల దాకా మాల విరమణ చేశారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకొని తిరుగు పయనయ్యారు. శనివారం ఉదయం నుంచి మళ్లీ తాకిడి మొదలు కాగా, సాయంత్రం 5గంటల నుంచి మాల విరమణ చేస్తున్నారు. మొత్తంగా లక్ష మందికిపైగానే స్వామివారిని దర్శించుకున్నారని యంత్రాంగం తెలిపింది. కాగా, ఈ యేడు ఎక్కువగా కాలినడకన మెట్లదారి గుండా రావడం కనిపించింది. అయితే గుట్ట కింది నుంచి పైకి భక్తులను తరలించేందుకు వేములవాడ ఆర్టీసీ డిపో నాలుగు మినీ బస్సులను ఉచితంగా నడిపించింది.
భక్తుల రద్దీ దృష్ట్యా కొండగట్టుపై టికెట్, ప్రసాద విక్రయ కేంద్రాలను నిరంతరాయంగా నడిపారు. సమాచారాన్ని మైకుల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు చేరవేయడంతో ఎక్కడా ఇబ్బంది రాలేదు. ఘాట్ రోడ్డు, మెట్లదారి, బొజ్జపోతన, మాల విరమణ మండపాల వద్ద బార్‌కోడింగ్ కంకణాలను నిరంతరాయంగా విక్రయించారు. ఇక్కడ ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, పాలక మండలి చైర్మన్ తిరుక్కోవెల మారుతీస్వామీ, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస శర్మ, సునీల్, ఆలయ ఏఈఈ లక్ష్మణ్‌రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, సంపత్,ఆలయ సిబ్బంది ధర్మేందర్, కే శ్రీనివాసాచారి, లక్ష్మారెడ్డి, సుధాకర్‌రెడ్డి, భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. గుట్ట మీద పోలీస్ ఔట్ పోస్టు, వాహన పూజా స్థలం, బొజ్జపోతన వద్ద మల్యాల పీహెచ్సీ సిబ్బంది మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలందించారు.
హనుమాన్ చిన్న జయంత్యుత్సవాలను ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. అంతటా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆయాచోట్ల అన్నదానాలు చేశారు. సాయంత్రం శోభాయాత్రలు తీశారు. రాజన్న అనుబంధ దేవాలయమైన శ్రీభీమేశ్వరాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయంలో భక్తులు పెద్దసంఖ్యలో మాల విరమణ చేశారు. అన్ని గ్రామాల్లోనూ అన్నదానాలు చేశారు. వందలాది మందితో శోభాయాత్రలు తీశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ వీరహనుమాన్ విజయయాత్రను మంత్రి గుంగుల కమలాకర్, మేయర్ వై సునీల్ రావు ప్రారంభించారు. మెట్‌పెల్లి పట్టణంలోని కాశీబాగ్, గోల్ హనుమాన్ ఆలయాల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పూజలు చేశారు.
కొండగట్టు అంజన్న సన్నిధిలో శనివారం హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.30 గంటల మధ్య పారాయణం చేశారు. అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి 41 రోజులపాటు నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ప్రతి రోజూ ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పారాయణం ఉంటుందని మఠాంజనేయ స్వామి భజన మండలి అధ్యక్షుడు మిట్టపల్లి లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశం, పాలకమండలి చైర్మన్ మారుతీ స్వామి, పాలకవర్గ సభ్యులు, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా జాగృతి కార్యవర్గం ఆధ్వర్యంలో దీక్షాపరులు, భక్తులకు మజ్జిగ, పండ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మేరకు పంపిణీ కేంద్రాలను పాలక మండలి చైర్మన్ తిరుక్కోవెల మారుతీస్వామీ, ఈవో టంకశాల వెంకటేశ్, జడ్పీటీసీ రాంమోహన్‌రావు ప్రారంభించారు. జాగృతి నాయకుల ఆధ్వర్యంలో సుమారు 3 వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఇక్కడ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు దావ సురేశ్, జాగృతి జిల్లా అధ్యక్షుడు అమర్దీప్ గౌడ్, నాయకులు నీలగిరి రాజేందర్రావు, ఉజ్జగిరి జమున, మల్లేశ్‌యాదవ్, యుగేంధర్, వొద్దినేని వెంకటేశ్వర్రావు, వొల్లాల శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.
చిన్న జయంతి సందర్భంగా స్వాములు వేలాదిగా తరలిరాగా, ఎక్కడా ఇబ్బందులు రాకుండా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. పోలీస్ బందోబస్తును ఎస్పీ సింధూశర్మ, అదనపు ఎస్పీ రూపేశ్కుమార్తోపాటు జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాశ్, మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మల్యాల సీఐ రమణమూర్థి, ఎస్ఐలు మంద చిరంజీవి, వంగ పురుషోత్తంలు మాల విరమణ, కేశఖండనం, దర్శనం, ప్రసాదాల కొనుగోలు సాఫీగా జరిగేటట్లు చూశారు.