చొప్పదండి, ఏప్రిల్ 16: చొప్పదండి సహకార సంఘం సేవలు భేష్ అని, అందుకు గుర్తింపుగానే జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంటున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలోని సంఘాల్లోనే చొప్పదండి పీఏసీస్ ఆదర్శంగా నిలుస్తున్నదని, వరుసగా మూడు సార్లు పురస్కారం రావడం అభినందనీయమన్నారు. 2019-20 సంవత్సరానికిగాను సంఘానికి నాఫ్స్ కాబ్ అవార్డు వచ్చిన సందర్భంగా శనివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పాలకవర్గ సభ్యులను వెంటబెట్టుకొని హైదరాబాద్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు.
ఎమ్మెల్యేతోపాటు సహకార సంఘం అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి సంఘ కార్యకలాపాల గురించి మంత్రికి వివరించారు. రైతులు ఉన్న ఊర్లోనే ఎరువులు తీసుకునేలా సొసైటీ పరిధిలో తొమ్మిది గ్రామాల్లో సంఘం సొంతం నిధులతో గోదాంలు నిర్మించినట్లు చెప్పారు. ఏడాదికి సంఘం టర్నోవర్ రూ.150 కోట్లుగా ఉందని, ఈ సంవత్సరం నికర లాభం రూ.1.52కోట్లు అని వివరించారు. గత ఐదేళ్ల నుంచి రైతులకు తమ వాటాధనంపై 10శాతం డివిడెండ్ ఇస్తున్నామని చెప్పారు. సొసైటీ ద్వారా నిరుపేద విద్యార్థులు 13మందికి రూ.65వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మే నెలలో సంఘం ద్వారా నిర్మించిన నూతన గోదాం ప్రారంభోత్సవానికి చొప్పదండికి వస్తానని, రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు పాలక వర్గ సభ్యులు కృషిచేయాలని సూచించారు.
సంఘాన్ని రాష్ట్రంలోని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మరే ఇతర సంఘాల్లో లేని విధంగా సంఘ సభ్యులకు ప్రమాద బీమా, కుటుంబంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువుకు ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె మాట్లాడారు. చొప్పదండి సంఘానికి మూడుసార్లు అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. కాగా, పాలకవర్గ సభ్యులను మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే సత్కరించారు. కాగా, పురస్కారాన్ని ఈ నెల 22న చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో ప్రదానం చేయనున్నారు. ఇక్కడ సంఘం ఉపాధ్యక్షుడు ముద్దం మహేశ్‌గౌడ్, డైరెక్టర్లు మల్లయ్య, మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, నర్సయ్య, కార్యదర్శి తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, పొరండ్ల సహకార సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి ఉన్నారు.