40కిలోమీటర్లు.. 40వేల మొక్కలు
గాంధారి ఎక్స్‌రోడ్ నుంచి బాన్సువాడ వరకు ఆకట్టుకుంటున్న అవెన్యూ ప్లాంటేషన్
ఆకట్టుకుంటున్న అవెన్యూ ప్లాంటేషన్
ప్రతి కిలోమీటర్‌కి వెయ్యి మొక్కలు
అధికారులు, ప్రజాప్రతినిధులకు మొక్కల సంరక్షణ బాధ్యతలు
రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం సత్ఫలితాలనిస్తున్నది. హరితహారంలో భాగంగా గతేడాది కామారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లే దారులకు ఇరువైపులా మొక్కలను నాటించారు. ఆ మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతూ పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి.
గాంధారి ఎక్స్‌రోడ్డు నుంచి బాన్సువాడ వరకు..
ఆరో విడుత హరితహారంలో భాగంగా గతేడాది స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు సురేందర్, హన్మంత్ షిండేలతో కలిసి 40 కిలోమీటర్ల మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఎక్స్ రోడ్డు, భూంపల్లి, లింగంపల్లి, గాంధారి మండల కేంద్రంతోపాటు గుడిమెట్, మాధవపల్లి, తిమ్మాపూర్, పొతంగల్ కుర్ధు, రాంపూర్ గడ్డ, పొతంగల్ కలాన్, మేడిపల్లి, గండివేట్, సర్వాపూర్, మొండిసడక్, బాన్సువాడ మండలంలోని జక్కల్‌దాని తండా, బోర్లం, కొయ్యగుట్ట, బాన్సువాడ పట్టణం వరకు మూడు వరుసల్లో మొక్కలు నాటారు. ఈ మొక్కల రక్షణ బాధ్యతను రోడ్డు పక్కన ఉన్న గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు అప్పగించారు.
ఆక్రమణలను
తొలగించి.. మొక్కలు నాటి..
హరితహారం కార్యక్రమం పుణ్యమా అని రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించారు. పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు నుంచి బాన్సువాడ పట్ణణం వరకు ఆర్అండ్బీ రోడ్డు మధ్యలో నుంచి, రోడ్డుకు ఇరువైపులా 50ఫీట్ల వరకు ఆక్రమణలను కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తొలగించి, చదును చేసి మొక్కలను నాటారు. ఈ రోడ్డుతోపాటు గాంధారి మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లపై ఆక్రమణలను తొలగించి మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న పంట భూముల్లో రైతుల కోరిక మేరకు మామిడి, వేప, చింత, కొబ్బరి తదితర మొక్కలను నాటించారు.
రకరకాల మొక్కలు..
హరితహారంలో భాగంగా భావితరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్లకు ఇరువైపులా రకరకాల మొక్కలను నాటించారు. వీటిలో నీడ నిచ్చే మొక్కలతోపాటు పండ్ల మొక్కలు, అలంకరణ మొక్కలు ఉన్నాయి. మామిడి, వేప, రావి, మర్రి, కానుగ, కొబ్బరి, చింత, దానిమ్మ, జామ, బాదం, అల్లనేరడి, కదంబ, కొనోకార్పస్, బోగుడ, తదితర రకాల మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి.
మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు
మండలంలోని ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతోపాటు గ్రామాల్లో నాటిన మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. మొక్కల సంరక్షణకు గ్రామ స్థాయిలో సర్పంచులతోపాటు పంచాయతీ కార్య దర్శులకు బాధ్యతలు అప్పగించాం.
-సతీశ్, గాంధారి, ఎంపీడీవో
ప్రతి మొక్కనూ సంరక్షిస్తున్నాము
హరితహారంలో భాగం గా రోడ్డుకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తున్నాం. పశువు లు, మేకలు మొక్కలను తినకుండా ట్రీగా ర్డుల ను ఏర్పాటు చేశాం. మొక్కల సంరక్షణ కు వాచర్‌ను నియమించాం.
-మమ్మాయి సంజీవ్, గాంధారి సర్పంచ్