అభివృద్ధిలో నంబర్ వన్.. మోర్తాడ్ మండలం
అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు పూర్తి
నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ మండలంగా ఎంపిక
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా.. ప్రజల ఆరోగ్యం, పల్లెల్లో పచ్చదనంతోపాటు గ్రామాలు శుభ్రంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతిలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దూసుకుపోతున్నది. ఇందులో భాగంగానే జిల్లాలోనే ఉత్తమ మండలంగా ఎంపికైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి, ప్రజల భాగస్వామ్యం ఫలించింది.
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణం, డంపింగ్‌యార్డులు, కంపోస్టుషెడ్లు, ప్రకృతివనాల ఏర్పాటు జిల్లాలోనే ముందుగా అన్ని గ్రామాల్లో పూర్తయ్యాయి. నిత్యం అధికారుల పర్యవేక్షణతో పనులు వేగంగా కొనసాగాయి. వీటి నిర్మాణాలు పూర్తికావడంతోపాటు వెంటనే వినియోగంలోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామాల్లో ప్రజలకు ఎన్నో అవసరాలు తీరినట్లయ్యింది. ముఖ్యంగా వైకుంఠధామాల ఏర్పాటుతో గ్రామాల్లో అంత్యక్రియలకు సంబంధించి ఎదురయ్యే ఇబ్బందులన్నీ దూరమయ్యాయి. వైకుంఠధామాలు కూడా పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఆహ్లాదకరంగా ప్రకృతి వనాలు
మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనాలు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా తయారయ్యాయి. ప్రకృతివనాల్లో కాలిబాటలు, కూర్చోవడానికి బెంచీల ఏర్పాటు, పూలమొక్కల పెంపకం మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అంశాలు. మానసిక ప్రశాంతత లభించేలా ప్రకృతి వనాలు తయారయ్యాయి. మోర్తాడ్‌లో ఏర్పాటు చేసిన వీపీఆర్ పార్కు మండలంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ ప్రకృతివనంలో పిల్లలు ఆడుకోవడానికి, వ్యాయామం చేసేందుకు పరికరాలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
గ్రామ రూపాలను మార్చిన ట్రాక్టర్లు
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం కోసం ట్రాక్టర్ల అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్‌ను మంజూరు చేశారు. వీటితో గ్రామాల రూపురేఖలే మారాయని చెప్పవచ్చు. ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించడంతో గ్రామాల్లోని వీధులన్నీ శుభ్రంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో పరిశుభ్రత కనిపిస్తున్నది. అదేవిధంగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండడంతో అవి ఏపుగా పెరుగుతున్నాయి.
నిత్యం అధికారుల పర్యవేక్షణ
పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రభు త్వం ప్రవేశపెట్టడమే కాకుండా కార్యక్రమాలు సక్రమంగా కొనసాగేలా అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవడంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి. పల్లెప్రగతి గ్రామసభలు నిర్వహించి సమస్యలను చర్చించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామాల్లో చాలా మట్టుకు సమస్యలు పరిష్కారమవుతున్నాయి. మండలస్థాయిలో కాని సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తున్నారు. అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. వీటితోపాటు గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత లేకుండా చూడడంతో అభివృద్ధి విషయంలో జాప్యం జరగడం లేదు.
అందరి సహకారంతోనే..
ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో మోర్తాడ్ను ఉత్తమ మండలంగా తీర్చిదిద్దుకోగలిగాం. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహకారం మరువలేనిది. ఇదే స్ఫూర్తితో మున్ముందు పల్లెప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేస్తూ.. అందరి భాగస్వామ్యంతో మండలాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం.
-శివలింగుశ్రీనివాస్, ఎంపీపీ, మోర్తాడ్
పరిశుభ్రంగా గ్రామాలు
పల్లెప్రగతి కార్యక్రమాలతో పరిశుభ్రత, పచ్చదనం పెరిగింది. ప్రతి గ్రామంలో ప్రకృతివనాలు ఏర్పాటుచేయడంతో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ట్రాక్టర్లతో చెత ్తసేకరణ సులువయ్యింది. ప్రజలకు ఇబ్బందులు దూరమయ్యాయి. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
-బోగ ధరణి, సర్పంచ్, మోర్తాడ్
సకాలంలో పనులు జరిగేలా చూస్తున్నాం
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఏ కార్యక్రమమైనా సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. అందుకు గ్రామస్థాయి అధికారుల పనితీరు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో ముందుండగలిగాం. జిల్లాలో ఉత్తమ మండలంగా మోర్తాడ్ ఎంపిక కావడం ఆనందంగా ఉంది.