అచ్చంపేట విత్తనోత్పత్తి కేంద్రానికి పూర్వవైభవం
1.37 కోట్ల చేపల విత్తనోత్పత్తికి చర్యలు
బంగారు తీగ, బొచ్చ, రాహు రకాల పెంపకం
చేప పిల్లల పెంపకానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు
బంగారుతీగ, బొచ్చ, రాహు రకాల పెంపకం
అచ్చంపేట చేపల విత్తనోత్పత్తి కేంద్రం ఉమ్మడిరాష్ట్రంలోనే మొట్టమొదటిది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆదరణ కోల్పోయిన కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో.. 1.37 కోట్ల చేపపిల్లల పెంపకాన్ని చేపట్టారు.
నిజాంసాగర్, ఆగస్టు 20: మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఉన్న చేపల విత్తనోత్పత్తి కేంద్రానికి పూర్వ వైభ వం రానున్నది. ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి చేపల విత్తనోత్పత్తి కేంద్రం కాగా, గత పాలకుల నిర్లక్ష్యంతో నిధు లు లేక ఆదరణ కోల్పోయింది. ఇందులో పనిచేస్తున్న మత్స్యకార్మికులను పట్టించుకునే వారు కరువయ్యారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ మత్స్యకార్మికుల జీవనోపాధి కోసం ఉచితంగా చేపపిల్లల విడుదల, రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల అందజేత లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో మత్స్యకార్మికులు నేడు దర్జాగా జీవిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఆదరణ కోల్పోయిన అచ్చంపేట చేపల విత్తనోత్పత్తి కేంద్రానికి మహర్దశ రానున్నది. ప్రభుత్వం రాష్ట్రంలోని 32 చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలకు నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా అచ్చంపేట విత్తనోత్పత్తి కేంద్రానికి నిధులు మంజూరు చేయడంతో గత నెలలో రూ. ఐదు లక్షలు ఖర్చు చేసి పాస్టిక్ కవర్స్‌ను, పైపులైను పనులు, నూతన బోరుబావి, పాండ్స్, కచ్చా పాండ్స్ మరమ్మతులు, బావిలో మట్టితీత పనులు పూర్తిచేయగా..చేపల విత్తనోత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
1.37 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి
ఈ కేంద్రంలో 1.37కోట్ల చేప పిల్లల పెంపకాన్ని చేపట్టారు. ఇందులో 30 లక్షల బొచ్చ, 35 లక్షల రాహు, 20 లక్షల బంగారు తీగ స్పామ్ తీసుకొచ్చి చేప పిల్లల ఉత్పత్తి ప్రారంభించారు. సిమెంట్ పాండ్స్‌తో పాటు కచ్చా పాండ్స్‌లో చేప పిల్లల పెంపకం చేపట్టడంతో విత్తనోత్పత్తి కేంద్రానికి మహర్దశ వచ్చినట్లయ్యింది. నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని చెరువులు, కుంటలకు ఇక్కడి నుంచే విత్తనాలు పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మొదటి కేంద్రం ఇదే
ఉమ్మడి రాష్ట్రంలో మొదటి విత్తనోత్పత్తి కేంద్రం ఇదే. 1960లో అచ్చంపేట గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా చేపల విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 36 సిమెంట్ పాండ్స్,11 కచ్చా పాండ్స్ ఉన్నాయి. వీటిలో 1.37 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. చేపల విత్తనోత్పత్తిపై కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని 44 గ్రామాలకు చెందిన 1180 మత్స్య కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. విత్తనోత్పత్తి కేంద్రానికి పూర్వ వైభవం వస్తే వీరందరికీ ఉపాధి అవకాశాలు మరింతగా లభిస్తాయి.
ఆనందంగా ఉంది
అచ్చంపేట విత్తనోత్పత్తి కేంద్రంలో చేపపిల్లల పెంపకం చేపట్టడం చాలా ఆనందంగా ఉం ది. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు చేప పిల్లల ఉత్పత్తి ఇక్కడే చేయడం చూస్తుంటే మళ్లీ పాత రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నది. ద్విచక్రవాహనాలు, తెప్పలు, వలలు అందజేయడంతో పాటు వంద శాతం రాయితీపై చేప పిల్లలను విడుదల చేస్తున్నది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నాం.
-రాములు, మత్స్య సొసైటీ నాయకుడు
బంగారు తీగ ఇక్కడే ఉత్పత్తి
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అచ్చంపేట చేపల విత్తనోత్పత్తి కేంద్రంలోనే చేపపిల్లలను ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం 1.37 కోట్ల చేప పిల్లల పెంపకం చేపడుతున్నాం. ఇవి పూర్తయ్యాక మరో 1.65 కోట్ల చేప పిల్లలను ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేశాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి బొచ్చ, రాహు రకాల స్పామ్ తీసుకువచ్చాం. బంగారు తీగ స్పామ్‌ను ఇక్కడే ఉత్పత్తి చేశాం.