ఒకప్పుడు తాగునీటి కోసం పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. గ్రామం ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో వందల ఫీట్ల లోతు తవ్వించినా చుక్క నీరు వచ్చేది కాదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే బావిపై ఆధారం. అలాంటిది ఇప్పుడాగ్రామంలో తాగునీటి సమస్య తీరింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో ఎటు చూసినా గ్రామం పచ్చదనంతో కళకళలాడుతున్నది. ప్రత్యేక నిధులతో ప్రతీ సమస్యను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బూర్గుల్ గ్రామం.
తాగునీటి సమస్య పరిష్కారం
బూర్గుల్ అనగానే ముందుగా తాగునీటి సమస్యే గుర్తుకు వచ్చేది. గ్రామం ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఈ సమస్య పరిష్కారానికి గ్రామశివారులో బోరుబావిని తవ్వించి, బోరు నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు సంపును నిర్మించారు. అక్కడి నుంచి నీటిని గ్రామంలోని వాటర్ ట్యాంకుకు ఎక్కించి, దాని ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారు.
వెల్లివిరిసిన పచ్చదనం
గ్రామస్తులకు మానసిక ప్రశాంతతతోపాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం పచ్చదనంతో కళకళాడుతున్నది. పార్కులో 25 రకరకాల పండ్లు, పూలు, నీడ నిచ్చే మొక్కలను నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. వాకింగ్ ట్రాక్‌లను, బెంచీలను ఏర్పాటు చేశారు.
ఆకట్టుకుంటున్న అవెన్యూ ప్లాంటేషన్..
బూర్గుల్ గ్రామంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి. పల్లెప్రగతిలో భాగంగా గ్రామపంచాయతీ కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను సద్వినియోగం చేసుకుంటూ ట్యాంకర్ సహాయంతో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఎండిపోకుండా నీరు పోస్తున్నారు. దీంతోపాటు పశువులు, మేకలు మొక్కలను మేయకుండా ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు.
గ్రామస్తుల సహకారంతోనే..
గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి పనులు చకచకా పూర్తి చేశాం. మున్ముందు మరింత అభివృద్ధి చేస్తాం. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చేలా ప్రకృతివనంలో అన్ని రకాల మొక్కలు నాటాం. మొక్కలను కంటికిరెప్పలా కాపాడుకోవడంతో గ్రామం మొత్తం పచ్చదనంతో కళకళలాడుతున్నది.
ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టి
పల్లెప్రగతి పనులపై ప్రత్యేక దృష్టి సారిం చాం. వైకుంఠధామంతోపాటు కంపోస్ట్ షె డ్డు, ప్రకృతివనాన్ని సకాలంలో పూర్తి చేశాం. గ్రామంలో వందశాతం పన్ను వసూలు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం.
మంచె ఐడియా..
చుట్టూ పచ్చని పొలాలు.. మధ్యలో కరెంటు టవరు.. యువ రైతుకి ఓ ఐడియా వచ్చింది. టవర్కున్న ఇనుప రాడ్ల సహాయంతో మంచెను నిర్మించాడు. మధ్యలో బెంచ్ వేసుకున్నాడు. ఎంచక్కా పొలం పనులు చూసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నాడు. ఈ చిత్రాన్ని నిజామాబాద్ నగర శివారులోని ముబారక్‌నగర్ ప్రాంతంలో ‘కెమెరా’ క్లిక్‌మనిపించింది.