లేనిబలాన్ని ప్రదర్శించేందుకు ఆరాటం
సభ్యత్వం కోసం సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారని ఆరోపణలు
దిగజారుడు రాజకీయాలపై టీఆర్ఎస్ ఫైర్
పోలీస్‌స్టేషన్‌కు చేరిన కోకల్‌దాస్ తండా వ్యవహారం!
వర్ని, ఆగస్టు 31 : నియోజకవర్గంలో లేనిబలాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ నాయకుల విమర్శలకు బలాన్ని చేకూర్చే ఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో వెలుగుచూశాయి. బీజేపీ నాయకులు రాజకీయాలంటే తెలియని వారి ఆధార్, ఫొటోలు తీసుకుని వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ బలవంతపు సభ్యత్వాలను అంటగడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకోసం సదరు పార్టీ నాయకులు అమాయకులను ఎంచుకుంటున్నారు. వర్ని మండలం కోకల్ దాస్‌తండాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. తండాకు చెందిన ఓ యువకుడి ఆధార్‌కార్డు, ఫొటోను అతడి సహచరుల వద్ద నుంచి సేకరించిన బీజేపీ నాయకులు సదరు యువకుడికి తెలియకుండానే అతడికి బీజేపీ సభ్యత్వాన్ని అంటగట్టారు. మీడియా ద్వారా విషయం వెలుగు చూడగా, సదరు యువకుడి తండ్రి 20 ఏండ్లుగా టీఆర్ఎస్ కార్యకర్తగా కొనసాగుతున్నారని, ప్రస్తుతం ఓ గ్రామానికి సర్పంచ్‌గా కొనసాగుతున్నాడని తేలింది. తనకు రాజకీయాలంటే అసలు తెలియదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బీజేపీలో చేరినట్లు సృష్టించారని సదరు యువకుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బాధ్యుడైన ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించగా తప్పు ఒప్పుకున్నట్లు సమాచారం. గతంలో కూడా గుంటూరు క్యాంపునకు చెందిన పలువురు యువకులు గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం విరాళాలు సేకరించేందుకు బీజేపీకి చెందిన ఓ నాయకుడి వద్దకు వెళ్లగా, ఆ యువకులంతా తమ పార్టీలో చేరినట్లు తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న సదరు యువకులు తాము టీఆర్ఎస్కు చెందిన వారమని, గ్రామాభివృద్ధికి విరాళాల కోసం వెళ్తే బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలను ఈ ఘటనలు ఎత్తిచూపుతున్నాయని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు.
‘దావత్‌కు పిలిచి కండువా కప్పిండ్రు’
మోస్రా(చందూర్), ఆగస్టు 31 : బీజేపీ నాయకులు తమను దావత్‌కు పిలిచి బలవంతంగా ఆ పార్టీ కండువాను కప్పారని మోస్రా మండలం గోవూర్ సొసైటీ డైరెక్టర్ నర్సారెడ్డి, చితారి గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీ గుప్తా భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి మండల కేంద్రంలో మంగళవారం నర్సారెడ్డి, చితారి గంగాధర్‌కు గులాబీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ బలంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను దావత్(పార్టీ)లకు పిలిచి బలవంతంగా వాళ్ల పార్టీ కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. బీజేపీలో చేరికలంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పిట్ల శ్రీరాములు, ఎంపీటీసీ కత్తి శంకర్, సర్పంచ్ నరేందర్, సొసైటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, అశోక్, శ్యామ్, సాయిలు, మధు పాల్గొన్నారు.