మంజీరలో ప్రవాహంలో ఇరుక్కుపోయిన 11మంది కాపరులు, 600 జీవాలు
కాపాడిన పోలీసు, రెవెన్యూ అధికారులు
కోటగిరి, సెప్టెంబర్ 8: గొర్రెలను మేతకోసం తీసుకొచ్చిన గొర్రెల కాపరులు మంజీరానది వరద నీటిలో చిక్కుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం టాక్లీ గ్రామానికి చెందిన 11 మంది గొర్రెల కాపరులు 600 గొర్రెలను మేపేందుకు రెండు రోజుల క్రితం కోటగిరి మండలం పొతంగల్, కొడిచెర్ల సమీపంలోని మంజీరానది వద్దకు తీసుకువచ్చారు. జోరు వర్షాలతో మంజీరాలో వరద ఉధృతి పెరిగింది. దీంతో గొర్రెల కాపరులు, గొర్రెలు వరదలో చిక్కుకున్నారు. నిజాంసాగర్ మరో 6 గేట్లు ఎత్తుతారని తెలియడంతో గొర్రెల కాపరులు టాక్లీ ప్రజాప్రతినిధికి ఫోన్లో సమాచారం అందించారు. ఆయన వెంటనే ఉన్నతాధికారులకు విషయం తెలుపడంతో.. పోలీసు, రెవెన్యూ అధికారులు మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో గొర్రెల కాపరుల వద్దకు చేరుకున్నారు. వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. జీవాలను కూడా తమతో తీసుకురావాలని పట్టుబట్టారు. దీంతో కోటగిరి ఎస్సై రాము, సిబ్బంది వెనుదిరిగారు. బుధవారం తెల్లవారుజామున ఎస్సై రాము, తహసీల్దార్ శేఖర్‌తో పాటు 30 మంది సిబ్బంది కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాపరులకు నచ్చజెప్పి గొర్రెలతో పాటు కాపరులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. స్థానిక సర్పంచ్ వర్ని శంకర్, ఉపసర్పంచ్ వినోద్, హెడ్‌కానిస్టేబుల్ రాజేందర్, సిబ్బంది నరేశ్, వాసు ఉన్నారు. జీవాలతో పాటు గొర్రెల కాపరుల ను కాపాడిన పోలీసులను పలువు రు అభినందించారు.
పోలీసులకు సీపీ అభినందన..
ఇందూరు, సెప్టెంబర్ 8: వరదలో చిక్కుకున్న గొర్రెల కాపరులతోపాటు జీవాలను రక్షించిన పోలీసులను నిజామాబాద్ సీపీ కార్తికేయ బుధవారం అభినందించారు. ఉదయం ఆరు నుంచి పదిన్నర గంటల వరకు కోటగిరి ఎస్సై రాము, సిబ్బంది సర్పంచ్ సహకారంతో సహాయక చర్యలను చేపట్టారని పేర్కొన్నారు. ఎస్సై రాముతోపాటు హెడ్‌కానిస్టేబుల్ రాజేందర్, హోంగార్డులు వాసు, నరేశ్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.