నిజాంసాగర్, సెప్టెంబర్ 7: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సింగూరు, పోచారం ప్రాజెక్టుల నుంచి 23,977 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని. దీంతో మంగళవారం ప్రాజెక్టులోని 6,7వ నంబర్ వరద గేట్ల ద్వారా 10,652 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. ముందుగా ప్రాజెక్టు గేట్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా 1403.66 అడుగుల (15.88 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నదన్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్లతో 29.917 టీఎంసీలకు గాను మంగళవారం సాయంత్రానికి 523.300 మీటర్లతో 28.22 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టులోకి 18,845 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుందని పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మరో 24 గంటల్లో భారీగా వరద వస్తుందని, ఇన్‌ఫ్లోకు అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేస్తామని సీఈ శ్రీనివాస్ తెలిపారు.
ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. నీటి విడుదల సమయంలో చప్పట్లు కొడుతూ సందడిచేశారు. పలువురు రైతులు గంగమ్మకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ మధుసూదన్, ఈఈ సోలోమాన్, డీఈఈ శ్రావణ్‌కుమార్, ఆర్డివో రాజాగౌడ్, డీఎస్పీ జైపాల్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఏఈ శివకుమార్, తహసీల్దార్ వేణుగోపాల్, టీఆర్ఎస్ మండల నాయకుడు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, వైస్ ఎంపీపీ మనోహార్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ 33 గేట్ల ఎత్తివేత
మెండోరా, సెప్టెంబర్ 7: ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోందన్నారు. దీంతో రాత్రి 33 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 3,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులు, భక్తులు నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. జెన్కోకు 7500 క్యూసెక్కులు (ఎస్కేప్ గేట్లతో గోదావరిలోకి 7వేలు, కాతీయ కాలువకు 500 క్యూసెక్కుల) నీటి విడుదల కొనసాగుతోందన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1089.60 అడుగుల(82.734 టీఎంసీలు) వద్ద ఉందని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి ఈ సీజన్లో 181.856 టీఎంసీల వరద వచ్చిందన్నారు.
కళ్యాణి ప్రాజెక్టు రెండు గేట్లు..
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 7: తిమ్మారెడ్డి శివారులో ఉన్న కళ్యాణి ప్రాజెక్టుకు ఎగుర ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తున్నది. దీంతో మంగళవారం రెండు గేట్లను ఎత్తు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
రామడ్గు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
ధరల్లి, సెప్టెంబర్ 7: ధర్పల్లి మండలంలోని రామడ్గు ప్రాజెక్టులోకి 3750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1278 అడుగులు కాగా, పూర్తిస్థాయిలో నిండింది.