బాన్సువాడ/ గాంధారి/ లింగంపేట/బీబీపేట్/బీర్కూర్/కామారెడ్డి టౌన్, ఆగస్టు 30 : జిల్లావ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేశారు.
గాంధారి మండలకేంద్రంలోని శ్రీకృష్ణ ధ్యాన మందిరం మాచాలే బాబా ఆధ్వర్యంలో, యాదవ యువజన సంఘం సభ్యులు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్ద ఉట్టికొట్టే వేడుకను ఉత్సాహంగా నిర్వహించారు. ఉట్టిని కట్టే కార్యక్రమంలో గ్రామ యువకులతో పాటు చుట్టు పక్కల గ్రామాల యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉట్టి కొట్టిన యువకులను బ్యాండుచప్పుల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శ్రీకృష్ణ ఆలయం వరకు ఊరేగించారు. లింగంపేట మండల కేంద్రంతోపాటు గ్రామాల్లోని కృష్ణాలయాల్లో భక్తులు పూజలు చేశారు. గోపాలకాల్వ కార్యక్రమాల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల కేంద్రంలో చిన్నారులు శ్రీ కృష్ణ, బలరామ వేషధారణలో ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. యువజన సంఘాల సభ్యులు, యువకులు, భజన మండలి సభ్యులు భజనలు చేస్తూ మండల కేంద్రంలోని ప్రధానవీధుల్లో ఉట్టిలను పగులగొట్టారు. మండలంలోని కోర్పోల్, మోతె, శెట్పల్లిసంగారెడ్డి తదితర గ్రామాల్లో గోపాల కాల్వలు నిర్వహించారు.
బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలోని మార్కండేయ ఆలయంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గ్రామస్తులు ప్రత్యేకపూజలు చేశారు. గ్రామాల్లో సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాన్సువాడ డివిజన్ కేంద్రంతోపాటు మండలంలోని కొల్లూర్, దేశాయిపేట్, తాడ్కోల్, హన్మాజీపేట్, బుడ్మి, బోర్లం, కోనాపూర్ తదితర గ్రామాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి -టేక్రియాల్ బైపాస్ రోడ్లో ఉన్న శ్రీ కృష్ణానందాశ్రమంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ఆశ్రమంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.