నాలుగు రోజులపాటు ఆరాధనోత్సవాలు
గద్వాలటౌన్, ఆగస్టు 22: మంత్రాలయ 1008 పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాదుల వారి ఆదేశానుసారం జిల్లా కేంద్రంలోని షేరెల్లివీధిలోని రాఘవేంద్రస్వామి మఠంలో ఈ నెల 23నుంచి 25వరకు రాఘవేంద్రస్వామి వారి 350వ ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారు భౌతికంగా బృందావన ప్రవేశం చేసి సోమవారం నాటికి 350 ఏండ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా మఠంలో స్వామి వారికి నాలుగు రోజుల పాటు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ప్రహ్లాదరాయ వారి పాదపూజ, మహా పంచామృతాభిషేకం, తులసీ అర్చన, అలంకారసేవ తదితర పూజా కార్యక్రమాలను మూడురోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
ఘనంగా ధ్వజారోహణం
స్వామివారి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ధన ధాన్య పూజ, గోమాతపూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సామూహిక సత్యనారాయణస్వామి, లక్ష్మీ పూజలు నిర్వహించారు.
ఆరాధనోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
సోమవారం నుంచి నిర్వహించే స్వామివారి ఆరాధనోత్సవాలకు మఠాన్ని నిర్వాహకులు ముస్తాబు చేశారు. నాలుగు రోజులపాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఉత్సవాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మఠం మేనేజర్ సంప్రతి మోహన్, మఠం అర్చకులు శ్రీనివాసాచారి తెలిపారు. అలాగే భక్తులు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు.