భక్తిశ్రద్ధలతో మొహర్రం
గ్రామాల్లో పండుగ వాతావరణం
ఊట్కూరు, కోయిలకొండలో ఆకట్టుకున్న పీర్ల సవారీ
అలయ్.. బలయ్, బొడ్డెమ్మలతో కోలాహలం
మొహర్రం వేడుకలను ఉమ్మడి జిల్లా వాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. శుక్రవారం చివరి రోజు కాగా కుల, మతాలకతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కందూర్లు నిర్వహించారు. దీంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఊట్కూరు, కోయిల కొండ వీధులు జనసంద్రమయ్యాయి. పీర్ల సవారీ, అగ్నిగుండం, అలయ్.. బలయ్, బొడ్డెమ్మ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఊట్కూర్, ఆగస్టు 20 : మొహర్రం (పీర్ల)పండుగ ను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. యుద్ధం లో వీర మరణం పొందిన ప్రవక్త మనుమలు హసన్, హుస్సేన్ త్యాగానికి గుర్తింపుగా పండుగ నిర్వహిస్తారు. శుక్రవారం మండల కేంద్రంతోపాటు పెద్దజట్రం, పగిడిమర్రి, చిన్నపొర్ల గ్రామాల్లో పండుగ వైభవంగా నిర్వహించారు. పీర్ల చావిడీలను దర్శించుకునేందుకు భక్తు లు పోటెత్తారు. ఊట్కూరులో దశమి పీర్ల సవారీని ద ర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి కుల, మతాలకతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హసన్, హుస్సేన్‌కు నైవేద్యం సమర్పించారు. మొక్కుబడుల్లో భాగంగా గొర్రెలు, మేకలను బలిచ్చి కందూర్లు నిర్వహించారు. పలువురు భక్తులు నవమి, దశమి రోజులను ప్రత్యేక సంతాప దినాలుగా పాటించి ఉపవాస దీక్ష చేపట్టారు. పెద్దపీర్ల మసీద్ నుంచి మెయిన్ బజార్, భరత్‌నగర్, శివాజీనగర్ ప్రాంతాల మీదుగా కొనసాగిన ఊరేగింపులో భక్తులు పీర్ల సవారీ వెంట నడిచారు. తెలంగాణ జానపద సంస్కృతిని తలిపించే విధంగా యువకులు కాలికి గజ్జెలు.. నడుముకు రుమాలు.. చేతి లో కర్రతో అసయ్ దూలా నినాదాలు చేస్తూ.. అలయ్.. బలయ్ ఆడారు. మహిళలు జానపద పల్లెపాటలతో బొడ్డెమ్మలు వేసి అలరించారు.
వైభవంగా డోలారోహణం..
పీర్ల సవారీ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన డోలారోహ ణం (తొట్లె) కార్యక్రమం ఉదయం, సాయంత్రం వైభవంగా జరిగింది. స్థానిక రుద్రనగర్లో ఆరెకటిక వంశస్తుల పిల్లలను ఊయల వేశారు. ఈ సందర్భంగా సవారీ చేత పిల్లలకు నామకరణం చేయించారు. ఈ వేడుకలకు హాజరైన భక్తులు పోటీపడి ప్రసాదం దక్కించుకున్నారు. ప్రసాదం దక్కించుకుంటే వారికి సంతాన యోగ్యత కలుగుతున్నదని భక్తుల నమ్మకం. రాత్రికి స్థానిక పెద్ద చెరువు అలుగు కట్టపై పీర్ల అలయ్.. బలయ్ కలియిక తో వేడుకకు ముగింపు పలికారు. భక్తులు చనిపోయిన తమ కుటుంబీకులను గుర్తు చేసుకొని శోకసంద్రంలో మునిగారు. ఎస్పీ డాక్టర్ చేతన పర్యటించి భద్రతా ఏ ర్పాట్లను పర్యవేక్షించారు. పేట, మహబూబ్‌నగర్ డీఎస్పీలు మధుసూదన్, కిషన్, మక్తల్ సీఐ శంకర్, ఎస్సై పర్వతాలు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్ని వసతులను కల్పించారు.
బీబీ ఫాతిమా దర్శనానికి భారీగా భక్తులు
కోయిలకొండ, ఆగస్టు 20 : అమ్మరో బీమమ్మ.. మా తల్లిరో బీమమ్మ.. అంటూ భక్తులు బీబీ ఫాతీమా పీరు దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున అమ్మకు ప్రభుత్వం తరఫున సర్కార్ శక్కర కార్యక్రమాన్ని తాసిల్దార్ ప్రకాశ్, సర్పంచ్ కృష్ణయ్య, బ్రాహ్మణులు నిర్వహించారు. అనంతరం అమ్మను ఖిల్లా కోట నుంచి ఊరేగింపుగా తరలించారు. భక్తుల మధ్య అగ్నిగుండం కార్యక్రమాన్ని జరిపించారు. బీబీ ఫాతీమా పీరును గ్రామంలోని ఉషన్పాషా, చాన్దూల, పారుపల్లి పీర్లు కలిసే సందర్భం ఆకట్టుకున్నది. యుద్ధంలో భర్త మొగులాలి మరణవార్తను గండెల్సాబ్ పీరు ద్వారా వినకూడదని బీబీ ఫాతిమా పీరు తప్పించుకొని ఖిల్లా గుట్టకు వెళ్లే ఘట్టం కనువిందు చేసింది. కడసారి బీబీ ఫాతిమాను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం పీర్లు నిమజ్జనం కావడంతో ఉత్సవాలు ముగిశాయి. ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్, సీఐ మహేశ్వర్‌రావు, ఎస్సై సురేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.